ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామ….ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సఖ్యతతో ఉంటూ సంబంధాలు నెరపడంతో ఆయనపై జగన్ చర్యలేవీ తీసుకోకుండా మిన్నకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ కు పక్కలో బల్లెంలా మారిన రఘురామ తాజాగా మరోసారి జగన్, విజయసాయిలపై విరుచుకుపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్ అడ్డుకోలేకపోయారని, ఈ విషయంలో నిస్సహాయత వ్యక్తం చేసిన జగన్…కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములలో కొన్ని ఎకరాలు అమ్మాలన్న ప్రతిపాదనను సీఎం జగన్ చేయడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ను జగన్ పునరుద్ధరించాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి….ప్రధాన మంత్రిని జగన్ కలవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని సూచించారు.
విశాఖ ప్రజలలో జగన్ కు ఆదరణ తగ్గిందని నిన్నటి పర్యటనలో రుజువయిందన్నారు. విశాఖలో రాజధాని వద్దన్న భావన విశాఖ ప్రజల్లో ఉందన్నారు. ‘విశాఖ రాజధాని వద్దు…. అమరావతి ముద్దు’ అనే నినాదంతో ప్రజలు ముందుకెళ్లాలని అన్నారు. ఏపీకి రాజధాని ఏదో తెలీదని, కాబట్టి జగన్ ఉగాది నుంచి రచ్చబండ కార్యక్రమం అని మాత్రమే ప్రకటించారని ఎద్దేవా చేశారు. ధార్మిక పరిషత్తు పునరుద్ధరణకు సీఎం జగన్ ను స్వామి స్వరూపానంద,అడగడం సంతోషకరమన్నారు.
పరస్త్రీ వ్యామోహంలాగా, పరబాషా వ్యామోహం సరికాదని, మాతృభాషలో భోధనపై కేంద్రం ఒక విధానం తీసుకువచ్చిందని, కోర్టులు స్టే ఇవ్వకున్నా ఇంకా ముందుకు వెళతామనడం సరికాదని అన్నారు. ఇంగ్లీషు భాష లేని చైనా అభివృద్ధి చెందిందని, ఇంగ్లీషు భాష అన్నింటికి పరిష్కారం కాదని రఘురామ జగన్ కు హితవు పలికారు. ఈ విషయాన్ని జగన్ గమనించి ఇంగ్లిషు మీడియం విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
కార్పొరేషన్ ఎన్నికలు, విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి రిఫరెండమని, మినీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ వీధులలో కాకుండా, ఢిల్లీ స్థాయిలో పోరాడితే మంచిదని రఘురామ సూచించారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ విజయం సాధిస్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అక్కడి ప్రజలు ఆమోదించినట్లేనని చెప్పాారు. రాష్ట్రంలో ఇంకా స్కీంలు వద్దని, స్కాంలు జరగకుండా ఉంటే చాలా మంచిదని రఘురామ అన్నారు.