ఏపీ సీఎం జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాటే అన్న చందంగా తనపై, తన వ్యాపార లావాదేవీలపై ప్రధాని మోడీకి, రాష్ట్రపతి కోవింద్ కు విజయసాయికి లేఖ రాయడంపై రఘురామ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్, విజయసాయిలపై ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశానని రఘురామ తెలిపారు.ఏ2 పెట్టిన సూట్‌కేసు కంపెనీలతో ఏ1 కార్యకలాపాలు జరుపుతున్నారని ఆరోపించారు. ట్విటర్లో తనపై విజయసాయి విష ప్రచారం చేశారని, ఆ వివరాలు కూడా లేఖలో రాశానని అన్నారు. సాయిరెడ్డి క్విడ్‌ప్రోకో, సూట్‌కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో బయటపెట్టానని చెప్పారు. విజయసాయి గుట్టు రట్టు చేస్తానని, బీ రెడీ అని వార్నింగ్ ఇచ్చారు.
తాను విదేశాలకు వెళ్లకుండా పాస్ట్‌పోర్టు రద్దు చేయాలని విజయసాయి అడుగుతున్నారని, 20కి పైగా కేసులున్న విజయసాయి పాస్‌పోర్టును ఏం చేయాలని రఘురామ నిలదీశారు. తన కంపెనీల లావాదేవీలన్నీ పక్కాగా ఉన్నాయని, ఎవరెన్ని ఆరోపణలు చేసినా భయపడబోనని రఘురామ అన్నారు. ఏపీ హక్కుల కోసం అందరం కలిసి రాజీనామా చేద్దామని, అందుకు సిద్ధమా? అని సవాల్ చేశారు. జగన్ బెయిల్ రద్దు కేసు పలు కారణాలతో మళ్ళీ వాయిదా పడిందని అన్నారు.