వక్ఫ్ సవరణ బిల్లుపై 2025 దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ తో పాటు రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావడంపై ముస్లిం సమాజం, ముస్లిం సంఘాల నేతలు, ఎంఐఎం నేతలు, పలు పార్టీలకు చెందిన ముస్లిం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సుప్రీంకోర్టులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావీద్ సవాల్ చేశారు.
ఈ బిల్లులో పొందుపరిచిన నిబంధనలు ముస్లిం సమాజపు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ఒవైసీ అన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే లాగా ఈ బిల్లు సవరణలున్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు చట్ట విరుద్ధమని, వక్ఫ్ ఆస్తులు లాక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కుట్ర పన్నుతోందని ఒవైసీ ఆరోపించారు.
ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయం ప్రతిపత్తిని ఈ బిల్లు దెబ్బతిస్తుందని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావీద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు, 2 రోజులపాటు పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చలు, తీవ్ర స్థాయిలో వాదోపవాదాల తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ గురువారం నాడు రాజ్యసభలో సైతం ఈ బిల్లు ఆమాదం పొందిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేయడం లాంఛనమే. అది పూర్తయితే ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది.