దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీనివ్వడంతో ఆ దూకుడు మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పై, ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండా భూముల వ్యవహారం నేపథ్యంలో కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు.
గిరిజనుల భూములు ఆక్రమించుకున్నారని ప్రశ్నించినందుకు బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని,తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. బెంగాల్ తరహాలో బీజేపీ నేతలు, కార్యకర్తలను కేసీఆర్ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. గుర్రంబోడు తండాలో టీఆర్ఎస్ పార్టీ గుంటనక్కలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి గిరిజనుల భూములను ఆక్రమించుకున్నాయని సంజయ్ ఆరోపించారు.
అదేంటని ప్రశ్నించిన 40 మంది పేదగిరిజనులపై అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. 2 నెలల పాటు జైలులో పెట్టి పీడించారని దుయ్యబట్టారు. గుర్రంబోడు తండాలోని స్థలాలు గిరిజనులవేనని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా టీఆర్ఎస్ నేతలు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆఫీసులోని ఓ ప్రధాన వ్యక్తి, కేసీఆర్ కుటుంబ సభ్యుడే ఈ ఆక్రమణకు కారణమని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
గుర్రంబోడు తండాలో పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలు, నేతలపై లాఠీచార్జ్ చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. పోలీసులపై రాళ్ల దాడి జరిగితే తానే స్వయంగా ఖండించి, క్షమాపణ కూడా కోరానని చెప్పారు. ”ఖబడ్దార్.. ఐజీ ప్రభాకర్ రావు.. నువ్వు ముఖ్యమంత్రికి గులాంగురి చేస్తే ఊరుకునేది లేదు. రానున్నది బీజేపీ ప్రభుత్వమే.. నీ సంగతేందో తేలుస్తాం” అంటూ సంజయ్ సంచలన ట్వీట్లు చేశారు. మరి, బండి సంజయ్ విమర్శలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.