భారత దేశ పార్లమెంటు అంటే.. సంప్రదాయాలకు పెద్దపీట వేసే అతి పెద్ద ప్రజాస్వామ్య వేదిక. ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య పండుగకు నిలువెత్తు ప్రతిరూపం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో నాయకులు తిట్టుకున్నారు. రాజకీయ పార్టీలు రంకెలేసుకున్నాయి. ఒకరిని ఒకరు బుల్డొజ్ చేసుకున్న రాజకీయాలు కూడా ఈ దేశానికి కొత్తకాదు. కానీ, పార్లమెంటు విషయానికి వస్తే.. మాత్రం అప్పటి వరకు గుక్కపట్టి ఏడ్చిన పిల్లాడు అమ్మను చూస్తే చప్పున కూలైనట్టు.. నాయకులు సంప్రదాయాలకు పెద్దపీట వేశారు.
పార్లమెంటులో తొలి ప్రధాని నెహ్రూనే కాదు.. మలి ప్రధానుల వరకు కూడా.. అందరూ.. చెప్పింది ఒక్కటే ప్రజాస్వామ్య దేవాలయమని! అలాంటి చోట సంప్రదాయాలు కునారిల్లుతున్నాయి. ఒంటెత్తు పోకడలు పెచ్చరిల్లుతున్నాయి. గతంలో ఉన్న సౌభ్రాతృత్వ రాజకీయాలు.. సంయమన రాజకీయాల స్థానంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయి. దీంతో పార్లమెంటు సంప్రదాయం.. కొడిగట్టే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య వాదులు ఈ వ్యవహారంపై గగ్గోలు పెడుతున్నారు. పార్లమెంటులో `మోడీ` సంప్రదాయం తెరమీదికి వచ్చిందంటున్నారు.
సాధారణంగా.. స్పీకర్ స్థానాన్ని ప్రభుత్వ పక్షం తీసుకుంటుంది. దీనికి ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తాయి. అందరూ కలిసి స్పీకర్ను ఎంపిక చేసుకున్నాక.. సంప్రదాయంగా ఆయనను సీటు వరకు తోడ్కొని వెళ్తారు. ఇప్పటి వరకు అదే జరిగింది. ఇదేసమయంలో ప్రతిపక్షం వాటాగా.. డిప్యూటీ స్పీకర్ను ప్రభుత్వ పక్షమే ఆఫర్ చేస్తుంది. ఇది కూడా.. 65 ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. కానీ మోడీ 2014లో అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఈ సంప్రదాయాలకు చెల్లు చెప్పి.. ప్రజాస్వామ్యానికి జెల్ల కొట్టారు. స్పీకర్ పదవిని తీసుకుంటున్న మోడీ.. డిప్యూటీ స్పీకర్ పదవినిప్రతిపక్షాలకు ఇవ్వకుండానే గత ఐదేళ్లు గడిపేశారు.
అదేమంటే మీకు మెజారిటీ లేదంటూ.. అప్పట్లో ఎదురు దాడి చేశారు. నిజానికి రాజీవ్ గాంధీ తన మాతృమూర్తి ఇందిరమ్మ హత్య తర్వాత.. 400 స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. అప్పుడు కూడా.. విపక్షం లేదు. అయినా.. ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ.. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ.. విపక్ష కూటమికి.. డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేశారు. కానీ, ఇప్పుడు మోడీ స్వామ్యం రాజ్యమేలుతోం ది. ఒకవైపు ప్రతిపక్షాలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వండి అని మొరపెడుతున్నా.. వ్యూహాత్మక మౌనం పాటిస్తూ.. తన ఏకీకృత సంప్రదాయ ధోరణులను ప్రజాస్వామ్యంపై రుద్దుతున్నారు.