దక్షిణాది నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసే స్థానంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని రామనాథపురం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా నిర్ణయం మారినట్టు తెలుస్తోంది. తమిళనాడులో పోటీచేసినా ఆ రాష్ట్రం అది పెద్దగా ప్రభావం చూపదు. అందుకే ఇప్పుడు తెలంగాణా గురించి మోడీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని పాలమూరు నుంచి పోటీ చేయాలని మోడీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకోగలిగింది.
2023లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని.. ఆ తర్వాత ఆరు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను క్లీన్ స్వీప్ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీకి అంత బలం లేదని ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. కాకపోతే సీట్లు బాగా పెరుగుతాయన్నది మాత్రం నిజం. అయితే ఆ సంఖ్యను పెంచుకునేందుకు, సౌత్ లో పాగా వేసేందుకు మోడీ కొత్త నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
పాలమూరు నుంచి ప్రధాని పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుందన్నది బీజేపీ ఎత్తుగడ. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఆలోచిచస్తున్నారట.