ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటారన్న సంగతి తెలిసిందే. అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఉప్పు, నిప్పులా ఉండడం సహజం. అదే సమయంలో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కూర్చోవాల్సి రావడం, కలిసి ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే, తాజాగా జగన్, చంద్రబాబులకు ఆ అరుదైన చాన్స్ వచ్చింది.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ‘అజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో చంద్రబాబు, జగన్ లు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. సీఎం హోదాలో జగన్ కు, ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. అయితే, విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఈ కార్యక్రమానికి పిలవడంపై జగన్ ఫీలవుతున్నారని టాక్ ఉంది. దీంతో, జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
కొంతకాలంగా, వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు…రాబోయే ఎన్నికల నేపథ్యలో టీడీపీతో కూడా స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశాలెక్కువగా ఉన్నాయన్న సర్వేల నేపథ్యంలోనే చంద్రబాబును బీజేపీ పెద్దలు మచ్చిక చేసుకుంటున్నారన్న టాక్ ఉంది. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో జరగబోతోన్న ఆ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారని తెలుస్తోంది. కానీ, చంద్రబాబును శత్రువుగా భావించే జగన్ కు మాత్రం ఈ పరిణామం మింగుడుపడడం లేదు.
అయితే, జగన్ తో పోలిస్తే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరు మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పవచ్చు. రాజకీయ విమర్శలు చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో ఒకే వేదికపై చంద్రబాబుతో కలిసి కనిపించడానికి ఆయన ఇబ్బంది పడేవారు కాదు. వైఎస్సార్, చంద్రబాబు ఒకే వేదికపై చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తన తండ్రి ఒక అడుగు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని చెప్పిన జగన్….ప్రతిపక్ష నేతను గౌరవించడంలోనూ ఆ నాలుగు అడుగులు వేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
Comments 1