నరేంద్ర మోడీ సర్కార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒక వైపేమో దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటారు. అలాగే ఇంకోవైపు బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఇంత వివక్ష స్పష్టంగా కనిపిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారని ఒక వెబ్ న్యూస్ లో వచ్చింది.
ప్రత్యేక హోదా ఇవ్వాలనేందుకు బీహార్ చెబుతున్న కారణాలను పరిశీలిస్తున్నట్లు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు చెప్పారని సదరు వెబ్ న్యూస్ లో రావడం వివాదంగా మారింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తారా ? ఇవ్వరా అన్నది వేరే విషయం. కానీ హోదా అంశం పరిశీలనలో ఉందని చెప్పారన్న ప్రచారమే పాజిటివ్ దృక్పదాన్ని చూపిస్తోంది. అదే ఏపీ విషయానికి వచ్చేసరికి అసలు హోదా ముగిసిన అధ్యాయమని, హోదా ఇచ్చేది లేదని, దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పిందే చెబుతున్నది కేంద్రం.
నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం+బీజేపీ కలిసి తీసుకున్న నిర్ణయం. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదాను 5 ఏళ్ళు ప్రకటిస్తే కాదు కూడదు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు ఇవ్వాల్సిందే అని అప్పటి బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఇప్పటి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ డిమాండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
సరే రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా అంశం ఎంతటి రాజకీయ వివాదాలకు కారణమైందో అందరికీ తెలిసిందే. అధికారంలోకి రాగానే నరేంద్ర మోడీ ఏపీ ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. కాంగ్రెస్, బీజేపీ వ్యవహారంతో మండిపోయిన జనాలు రెండు పార్టీలకు ఎన్నికల్లో బాగానే సత్కారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీహార్ కు ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు చెప్పటమంటే మామూలు విషయం కాదు.
బీహార్ విషయంలో సానుకూలంగా ఉందనేందకు అక్కడ అధికారపక్షం కాబట్టే. బీహార్లో జనతాదళ్ తో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. రేపటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎంపీ సీట్లు చాలా అవసరం. అందుకనే జనాలను ఆకట్టుకునేందుకు హోదా అంశం పరిశీలనలో ఉందని నీతిఅయోగ్ తో మోడియే చెప్పిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. ఎందుకంటే మోడీ అనుమతి లేకుండా నీతిఅయోగ్ ఉపాధ్యక్షుడు ఇలాంటి ప్రకటనలు చేసే అవకాశమే లేదు.