ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సుధీర్ఘ భేటీనే నిర్వహించారు. దాదాపుగా 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలొ ఏపీకి సంబంధించిన సమస్యలను జగన్ ఏ మేరకు ప్రస్తావించారన్నది అసలు అంతు చిక్కడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా ప్రధాని వద్దకు వెళ్లిన ఏ సీఎం అయినా తాను ఏమేం సమస్యలను లేవనెత్తాను? ప్రధాని ఏమేం హామీలిచ్చారు? అంతిమంగా రాష్ట్రానికి ఏమేం ప్రయోజనాలు చేకూరబోతున్నాయన్న విషయాలను మీడియా సమావేశం పెట్టి మరీ వివరిస్తారు. అయితే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానితో భేటీలో అసలు ఏమేం చర్చకు వచ్చాయన్న విషయాన్ని జగన్ ఇప్పటిదాకా చెప్పిన పాపానే పోలేదు. దీంతో ఏదో సొంత ఎజెండాతోనే జగన్.. మోదీ వద్దకు వెళ్లారన్న విపక్షాల వాదనకు బలం చేకూరుతోందని కూడా చెప్పక తప్పదు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తీవ్ర ఆర్థిక లోటుతో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో విభజన చట్టంలో ప్రస్తావించిన ప్రత్యేక హోదాను సాధించి తీరతామని జగన్ ఎన్నికలకు ముందు చెప్పారు. అయితే ఎన్నికలు ముగిసి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రత్యేక హోదాను పలికేందుకే జగన్ ఇష్ట పడటం లేదు. అయినా సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో కొలువుదీరిన మోదీ సర్కారు వద్ద ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాలేమని కూడా జగన్ ఇదివరకే చెప్పేశారు. ఈ క్రమంలో వారం పది రోజుల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వరుసగా రెండు రోజుల పాటు భేటీ వేసిన జగన్… ఆ వెంటనే మోదీ వద్దకు వెళ్లిపోయారు.
ఓ రాష్ట్రానికి సీఎం హోదాలో ప్రధాని వద్దకు జగన్ వెళ్లడంలో తప్పు లేదు గానీ… ప్రధాని వద్ద తాను ఏ చర్చించానన్న విషయాన్ని చెప్పకపోవడమే జగన్ చేస్తున్నన పొరపాటుగా చెప్పాలి. అయినా సొంత ఎజెండాతో ఢిల్లీ వెళ్లిన జగన్… మోదీతో తాను ఏం చర్చించానన్న విషయాన్ని ఎలా చెబుతారన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తించేవే. తనపై ఇప్పటికే అక్రమాస్తుల కేసులు వేలాడుతున్నాయి.
రాజకీయ నేతలపై నమోదయ్యే కేసులను ఏడాది వ్యవధిలోగా పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్న దరిమిలా… జగన్ వరుసపెట్టి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న వైనం చూస్తుంటే… ఎక్కడ తాను అరెస్ట్ అవుతానోనన్న భయం ఆయనను వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా బీజేపీకి దగ్గరై… రాష్ట్రంలో తనకు ప్రత్యర్థి వర్గమన్నదే లేకుండా చేసుకునే పనికి కూడా జగన్ సానబెడుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
మొత్తం మీద ఓ రాష్ట్రానికి సీఎం హోదాలో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న జగన్… రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి తన సొంత ఎజెండా మేరకే నడుచుకుంటున్నారన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తనపై నమోదైన కేసుల నుంచి తనను తాను రక్షించుకోవడంతో పాటుగా తన ప్రత్యర్థులను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే జగన్ ముందుకు సాగుతున్నట్లుగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తనపై నమోదైన కేసులను కొట్టివేయించుకోవడంతో పాటుగా తన ప్రత్యర్థులైన చంద్రబాబు అండ్ కోను ఏదో రీతిన జైలులోకి నెట్టేసేలానే జగన్ మంత్రాంగం రచిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో భేటీకి సంబంధించిన వివరాలేమీ బయటపెట్టకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.