ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేశారు. చంద్రబాబుకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తుండడం పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై మోడీ అభినందనల జల్లు కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి అభినందించారు. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో మరిన్ని లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక, జూన్ 9న చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అనధికారికంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోసం ఏపీ పోలీసులు కాన్వాయ్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నివాసంతోపాటు టీడీపీ కేంద్ర కార్యాలయం, కరకట్ట ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.