ప్రజలకు చేరువ కావాలి.. పార్టీని మరోసారి అదికారంలోకి తేవాలనే నినాదంతో వైసీపీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అదేసమయంలో వివాదాలు వద్దు.. అందరినీ కలుపుకొని పోవాలని కూడా నాయకులకు సూచిస్తోంది. మరి ఈ మాట ఎంత మంది వింటున్నారు? అంటే.. సగం మందికిపైగా నాయకులు పార్టీ అధిష్టానం సూచనలను బేఖాతరు చేస్తున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.
ఇది.. తాడేపల్లి వర్గాలు చెబుతున్న మాటే. ముఖ్యంగా కీలకమైన అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో మినహా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇదే ఒరవడిని కొనసాగించి.. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు కూడా తన ఖాతాలో వేసుకునేందుకు కృషి చేయాలని నాయకులకు చెబుతోంది. అయితే.. ఈ మాటలను వింటున్నవారు కనిపించడం లేదు. ముఖ్యంగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది.
ఆయన అడు పెడితే.. వివాదం.. నోరు తెరిస్తే.. వివాదం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. గడప గడపకు కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్ చెప్పినా.. ఏదో మొక్కుబడిగా కార్యక్రమం పూర్తి చేసి మమ అనిపించుకున్నారు. ఎక్కువగా జేసీ వర్గంతో వివాదాలు.. విభేదాలకు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తుండడంతో కొత్తగా పార్టీలో చేరేవారు కూడా కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు.. ఆయన తన వారసుడిని కూడా రంగంలోకి దింపేశారు.
వాస్తవానికి వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నా.. పెద్దారెడ్డి తనయుడు మాత్రం దూకుడుగా ఉన్నారు. ఇదే విషయాన్ని మీడియా ఇటీవల ఆయనను ప్రశ్నిస్తే.. ఎందుకు ఇవ్వరు కష్టపడే వారికి ఇస్తామని చెబుతున్నారుగా! ఇవ్వకపోతే చూద్దాం లే! అని వ్యాఖ్యానించడం కూడా.. పార్టీలోను, నియోజకవర్గంలోనూ చర్చకు దారితీస్తుండడం గమనార్హం. మొత్తానికి ఎమ్మెల్యే వ్యవహారంతో ఇక్కడ వైసీపీ విలవిల్లాడుతుండడం గమనార్హం.