ఏపీ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ.. ఈ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల అది జరగలేదు.
ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో ఈ పథకం గురించి మాట్లాడారు. అయితే తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఫ్రీ బస్సు స్కీమ్ అమలుపై కీలక ప్రటకన చేశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.. మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని, దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే ఈ దీపావళి పండుగకు ఉచిత సిలిండర్ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన ప్రకటించారు. దీపావళికి డబుల్ ధమాకా అంటూ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ తెలిపారు. కాగా, నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో ఉచిత పథకాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.