ఏపీ మహిళలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకంపై తాజాగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఫ్రీ బస్సు స్కీమ్ కూడా ఒకటి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి నాయకులు ఘంటాపథంగా చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కాకపోవడంతో.. ప్రత్యర్థ పార్టీ నాయకులు ఘాటుగా సెటైర్లు పేలుస్తున్నారు.
అవేమి పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు తన పని తాను చేసుకుంటూ పోతోంది. కొంత ఆలస్యమైనా.. ఎవరూ వేలెత్తి చూపించకుండా పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు పథకం అమలు తీరుతెన్నుల పరిశీలనకై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు అవుతోంది? అక్కడి విధివిధానాలు ఏంటి? ఏపీలో ఎలా అమలు చేస్తే బాగుంటుంది? తదితర విషయాలపై నివేదికను, సూచనలను వీలనైంత త్వరగా ఇవ్వాలంటూ ముగ్గురు మంత్రులతో ఈ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇక తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రీ బస్సు స్కీమ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే విజయవంతంగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఒకటో తేదీన ప్రారంభించి 16న మూసేయడం మాకు ఇష్టం లేదని.. ఈ విషయంలో లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఏపీ ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని.. కొత్త బస్సులతో పాటు సిబ్బందిని కూడా నియమిస్తామని తెలిపారు.