తెలుగు తమ్ముళ్లకు తాజాగా టీడీపీ సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణ చెప్పారు. ఆదివారం నూజివీడు బస్టాండు సెంటర్లో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఎంట్రీ కొంపముంచింది. వైకాపా హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి చేయించడమే కాకుండా పలుమార్లు బాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన జోగితో మంత్రి పార్థసారధి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ప్రస్తుత ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వేదిక పంచుకోవడం వివాదమైన సంగతి తెలిసిందే.
లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా టీడీపీ నేతలతో జోగి సన్నిహితంగా మెలగడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణయించుకోలేకపోయారు. ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. దాంతో కంగారుపడిపోయిన మంత్రి పార్థసారధి ఇప్పటికే చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. లచ్చన్న విగ్రహావిష్కరణ, బహిరంగ సభలో వైసీపీ నాయకుడు పాల్గొంటున్న సమాచారం తనకు తెలియదని సోమవారమే వివరణ కూడా ఇచ్చారు.
అయినాసరే టీడీపీ కార్యకర్తలు కూల్ అవ్వకపోవడంతో.. అమరావతిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ మంత్రి పార్థసారథి బహిరంగంగా సారీ చెప్పారు. నూజివీడు కార్యక్రమానికి జోగి రమేష్ వస్తున్నాడని తెలిస్తే వెళ్లే వాడినే కాదని.. తనను ఆహ్వానించినప్పుడు ఇతర పార్టీల నాయకులు ఎవరు రారని చెప్పారని.. అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిగా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు వెళ్లడానికి సమ్మతి తెలిపానని పార్థసారథి తెలిపారు.
చంద్రబాబు, లోకేష్ నాకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ మరవలేదని.. టీడీపీ పార్టీ సిద్ధాంతాలకు నేనెప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పారు. టీడీపీ కార్యక్రమాల్లో చొరబడటం వైసీపీ నేతలకు ముందు నుంచి అలవాటేనని.. ఇప్పుడు కూడా అదే జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. ఇందులో తన ప్రమయం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా జోగి రమేశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవు, అలాగే అతనితో సాన్నిహిత్యం కూడా లేదని మంత్రి తెలిపారు. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని.. పార్టీ హైకమాండ్, కార్యకర్తలకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానని మంత్రి పార్థసారథి అన్నారు.