జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెం జడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధినీ, విద్యార్థులు లోకేష్ పేరు వచ్చేలాగా ఎండలో కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఆ ఘటనపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై లోకేష్ స్పందించారు. ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలలో తన జన్మదిన వేడుకలు నిర్వహించడం పై లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
“రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరుతున్నాను” అని లోకేష్ ప్రకటించారు.
వాస్తవానికి ఇటువంటి పుట్టినరోజు వేడుకలను కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహంతో నిర్వహించారు. ఈ విషయం గురించి లోకేష్ కు ఏ మాత్రం సమాచారం లేదు. ఇటువంటి వాటిని ఆయన అస్సలు ప్రోత్సహించరు. కానీ, కొన్ని సార్లు తన పై అభిమానంతో కొందరు చేసే ఈ తరహా పనుల వల్ల లోకేష్ వివరణనివ్వాల్సి రావడం బాధాకరం.