ప్రస్తుతం ఏపీలో అధికార-విపక్ష నేతలు కలిసినా, మాట్లాడుకున్నా వేరె లెవల్ లో రచ్చ జరుగుతోంది. పార్టీ జంప్ లేదంటే పర్సనల్ బెనిఫిట్స్ అంటూ ట్రోలర్స్ నెగటివ్ ప్రచారంతో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్నారు. ఇటీవల మంత్రి పార్థసారధి, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతటి వివాదం అయిందో తెలిసిందే. తాజాగా టీడీపీ మంత్రి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విషయంలోనూ ఇదే జరిగింది. సంస్కారంతో నమస్కారం పెడితే.. ఏకంగా టీడీపీ మంత్రి బొత్స కాళ్లు మొక్కారంటూ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
విజయనగరం జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అది కూడా బొత్స సోదరుడు అప్పల నరసయ్యను ఓడించి. అనూహ్యంగా కొండపల్లికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఇలాంటి సమయంలో వైసీపీ సీనియర్ నాయకుడు బోత్స సత్యనారాయణ ఇటీవల ఎదురుపడగా కొండపల్లి శ్రీనివాస్ ఆయనకు ప్రదాభివందనం చేశారంటూ ప్రచారం మొదలైంది. రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అవ్వడంతో.. మంత్రి కొండపల్లి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బొత్స కాళ్లు మొక్కానంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కొండపల్లి క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్.. నవంబర్ 11న అసెంబ్లీ లాబీలో ఇతర ఎమ్మెల్యేలతో పాటు కూర్చుని ఉన్న టైమ్ లో బొత్స సత్యనారాయణ అటువైపుగా వచ్చారు. అందరితో పాటు తాను కూడా లేచి సంస్కారంతో ఆయన్ను పలకరించాను. అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదని వివరించారు. సంస్కారంతో తాను నమస్కారం పెడితే కాళ్లు మొక్కానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
విజయనగరం జిల్లాలో తమ కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. గజపతినగరం నుంచి బొత్స, కొండపల్లి కుటుంబాలు ముఖాముఖిగా తలపడుతున్నాము. అలాంటిది తానెందుకు బొత్స కాళ్లు పట్టుకున్నానంటూ మంత్రి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జిల్లాలో బొత్స కుటుంబం ఎటువంటి అభివృద్ధి చేయలేదని.. ఎంతో మంది ఆ కుటుంబం వల్ల అన్యాయానికి గురయ్యారని మంత్రి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.