తన భద్రత తగ్గింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ సీఎం, వైకాపా అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నాయకుడు, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సెటైర్లు పేల్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఎద్దేవ చేశారు.
పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని కొల్లు రవీంద్ర సూచించారు. ఈ క్రమంలోనే పేర్ని నానికి సైతం ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పిచ్చికి తగ్గట్టు మా బందరు వైసీపీ నేత పేర్ని నాని తయారయ్యాడని.. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తే నాని దాన్ని వక్రీకరిస్తున్నాడని మండిపడ్డాడు.
కొడాలి నాని, వల్లభనేని వంశీని ఆయనే దాచారన్న అనుమానాలు ఉన్నాయన్నారు. పేర్ని నాని పాపాలు పండుతున్నాయి.. అక్రమాస్తులు, దోపిడి, కుమారుడుతో చేయించిన గంజాయి దందా అన్నీ బయటకు వస్తాయని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏపీ ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు.
ఇక రాష్ట్రాన్ని ఐదేళ్లు రాబందుల్లా పీకుతున్న జగన్ అండ్ కో.. ఇప్పుడు సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధి చూసి ఓర్వలేకపోతోందని మంత్రి రవీంద్ర మండిపడ్డారు. పాపాలు చేసి పారిపోయిన వైకాపా నేతల అంతు పోలీసులు చూస్తారని.. ఎక్కడున్నా వారిని తీసుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు వారు రెడీగా ఉన్నారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.