ఏపీలో కొద్ది నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు రెబల్స్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ నుంచి ఈ నలుగురు బయటకు వచ్చేసి ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న లక్షణాలు జగన్ కు లేవని, ఆ గుణాలు లేని జగన్ ఇకపై జన్మలో ముఖ్యమంత్రి కాలేరని షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్ వంటి నేతలు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరని అన్నారు. విశాఖలోని రుషికొండ భవనాలను సరదాగా కడుతున్నట్టు ఉందని, సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్ గ్రహించడం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారం చేపడుతుందని, అలా జరగకపోతే గుండు కొట్టుకోవాల్సిందే అంటూ చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపికి అన్ని జిల్లాల్లోనూ సానుకూల స్పందన వస్తుందని, జనసేనతో కలిసి ముందుకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు టికెట్ లేదని జగన్ చెప్పారని, తన గ్రాఫ్ పడిపోయిందని కించపరిచారని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరిలో తాను డబ్బులు తీసుకున్నట్టుగా జగన్ ఆరోపించారని, అక్కడ సంపాదించడానికి ఏముందని ప్రశ్నించారు. పార్టీ బలోపేతం కోసం తాను అహర్నిశలు శ్రమించానని, లేనిపోని అనుమానాలతో తన టికెట్ జగన్ అమ్ముకున్నారని ఆరోపించారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎటు చూసినా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. జగన్ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికి వారు దోచుకుంటున్నారని, బటన్ నొక్కటమే పనిగా పెట్టుకుని రాష్ట్రాన్ని జగన్ అప్పలపాలు చేశారని ఆరోపించారు.