చాలాకాలం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల గురించి ప్రత్యక్షంగా మాట్లాడిన వైనం సంచలనం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ తో చిరంజీవి సఖ్యతగా ఉండడంతో ఆయనపై జనసేన కార్యకర్తలు కాస్త గుర్రుగా ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో వైసీపీకి కాస్త దూరంగా చిరు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జనసేన పార్టీకి చిరు 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడంతో తమ్ముడి పార్టీకి చిరు మద్దతుగా నిలిచినట్లయింది. ఇక, తాజాగా మరో అడుగు ముందుకు వేసిన చిరు…జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిపై స్పందించారు.
తన తమ్ముడు పవన్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని, కూటమి ఏర్పడడం మంచి పరిణామమని అన్నారు. అనకాపల్లి లోక్‌సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ లు హైదరాబాద్‌లోని చిరును ఆయన నివాసంలో కలిసిన సందర్భంగా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు. పవన్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం కూటమిగా ఏర్పడ్డారని, ఇది శుభపరిణామని, సంతోషంగా ఉందని చెప్పారు.
తన చిరకాల మిత్రుడు సీఎం రమేశ్, తన ఆప్తుడు పంచకర్ల రమేశ్ లు అనకాపల్లి లోక్‌సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారని, వారిద్దరూ సమర్థులని, నియోజకవర్గాల అభివృద్ధికి దోహదపడతారని అన్నారు. ఆ విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. కేంద్రంతో సీఎం రమేశ్‌కు ఉన్న పరిచయాలు అనకాపల్లి లోక్‌సభ స్థానం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని, దీంతో, పంచకర్ల రమేశ్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కోరుకునే అభివృద్ధి పనులు సజావుగా సాగిపోతాయని చెప్పారు. ప్రజలందరి ఆశీస్సులు వీరిపై ఉంటాయని నమ్ముతున్నానని, దయచేసి వీరిద్దరిని గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నది తన కోరిక అని, దానికి ప్రజలు నడుం బిగించి ఇటువంటివారికి ఓటు వేసి గెలిపించాలని చిరంజీవి అన్నారు.