సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ కు ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని, కారు కుడిభాగం పూర్తిగా ధ్వంసం అయిందని, కానీ, డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కారులో ఎడమ వైపు కూర్చొన్న మహేశ్‌కు తీవ్ర గాయాలు కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
గతంలో మహేశ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పలుమార్లు దాడులు జరిగాయని, అందుకే నిజాయితీగల అధికారితో ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఏపీ సీఎం జగన్‌ను మందకృష్ణ కోరారు. కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. మరోవైపు, నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు మహేశ్ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. సురేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం జగన్ పై మంద కృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ, జగన్ కోసం మహేశ్ ప్రచారం చేశారని, కానీ, మహేశ్ కు సీఎం జగన్ కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని విమర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా వైసీపీ నేతలెవరూ మహేశ్ భౌతిక కాయానికి నివాళులు కూడా అర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులంటే వైసీపీకి ఇంకా చులకన భావమే ఉందని, దళితులకు గౌరవం, గుర్తింపు ఇవ్వబోరని మరోసారి అర్థమైందని మందకృష్ణ అన్నారు.