ఏపీలో ఎన్డీయే కూటమికి ముఖ్యంగా టీడీపీ కి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మార్పీఎస్ నిర్ణయించిందని అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై చర్చించారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం దళితులకు రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని బాబును కోరారు. దాదాపు 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు.
‘కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే అన్ని కార్పొరేషన్లలో, నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలి.’ అని చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ’40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోంది“ అని చంద్రబాబుతెలిపారు.
మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అవుతుంద న్నారు. ప్రభుత్వంపై తెలుగుదేశం ఎంత గట్టిగా పోరాడుతుందో.. అంతకంటే గట్టిగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తోందని చంద్రబాబు కితాబునిచ్చారు. మాదిగ సామాజిక వర్గాన్ని అధికారంలో భాగస్వాములను చేస్తామన్నారు. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమన కాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ పోరాటం అభినందనీయని చంద్రబాబు పేర్కొన్నారు.
మాదిగలను ఆకాంక్షలను చంద్రబాబు ముందుంచామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలను మోసం చేశారని.. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేటును కూడా పెట్టలేదని విమర్శించారు. మాదిగల సంక్షేమాన్ని జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మాదిగలంతా వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పని చేస్తారని స్ఫష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు.
‘కేంద్రంలో మోడీపై, రాష్ట్రంలో చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది. మాదిగలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. 29 రిజర్వుడ్ సీట్లలో మాదిగలకు జగన్ కేవలం 10 స్థానాలు మాత్రమే ఇస్తే.. చంద్రబాబు టీడీపీ పోటీ చేసే 24లో 14 మాదిగలకు కేటాయించారు. జనసేన పోటీ చేసే రిజర్వుడ్ స్థానాలు మూడింటిలో ఒకటి మాదిగలకు ఇవ్వాలని పవన్ ను కోరుతాం. ఎన్డీయే కూటమి గెలుపు మాదిగల గెలుపగా భావిస్తాం.’ అని మందకృష్ణ పేర్కొన్నారు.