బెంగాల్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒక ఓడిపోయిన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా మమతా బెనర్జీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె పార్టీ మాత్రం ఘన విజయం దక్కించుకుంది. దీంతో మూడోసారి ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని రాజ్భవన్లో బుధవారం గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రోటోకాల్ మేరకు మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా నిరాడంబరంగా జరిగింది. మమతా బెంగాలీలో ప్రమాణస్వీకారం చేశారు.
అంతకు ముందు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ విలేకరులతో మాట్లాడుతూ… కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.
కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 292 సీట్లలో 213 సీట్లను గెలుచుకున్న టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 77 స్థానాలను బీజెపీ గెలుచుకుంది.
పశ్చిమ బెంగాల్ 17 వ అసెంబ్లీ నాయకురాలిగా మమతా బెనర్జీని ఎన్నుకున్నట్లు టీఎంసీ పార్టీ నుంచి సమాచారం వచ్చిన తరువాత, మే 5 న ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బెనర్జీని రాజ్ భవన్కు ఆహ్వానించామని గవర్నర్ అని ధన్కర్ ట్వీట్ చేశారు.
కాగా తృణమూల్ ఎమ్మెల్యేలు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విమన్ బెనర్జీని కొత్త అసెంబ్లీ యాక్టింగ్ స్పీకర్గా ఎన్నుకున్నారు. ఇదిలావుంటే, సంప్రదాయం ప్రకారం.. ఆరు నెలలు మాత్రమే మమత సీఎంగా కొనసాగుతారు.
ఈ లోగా ఆమె అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదా మరో సారి రాజీనామా సమర్పించి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.