ఎన్టీఆర్ క్లుప్తంగా పలికే పేరు. నందమూరి తారకరామారావు అనే విశ్వరూపానికి సంక్షిప్తంగా పలికే పేరు. వందేళ్ల ఎన్టీఆర్ పేరు ఈ ఊరు, ఆ ఊరు అని కాదు తెలుగు జాతి మొత్తం గుర్తు పెట్టుకుంటోంది. స్మరిస్తుంది. ఆయన జాతికి గౌరవం ఇచ్చిన వ్యక్తి అని కీర్తిస్తుంది. ఆ మాటకు వస్తే తెలంగాణలోనూ ఆయన్ను ఆరాధించిన నేతలు ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే ఆయన నీడలో ఎదిగిన వ్యక్తుల్లో కేసీఆర్ కూడా ఒకరు. కానీ ఆయన ఈ నిజాన్ని అంగీకరించరు. ఇప్పుడంటే ఆయనొక రాష్ట్రాన్ని నడిపే శక్తి కావొచ్చు కానీ ఆత్మ గౌరవం నినాదం వినిపించిన ప్రతిసారీ ఆయన కానీ జగన్ కానీ ఎవ్వరైనా కానీ ఎన్టీఆర్ ను మించిపోలేరు. ఎన్టీఆర్ ను మించి ఎదగలేరు కూడా !
నిన్నమొన్నటి వేళ జగన్ జాతీయ మీడియా సలహాదారు అమర్ అంటున్నారు 80ల కాలంలో గ్రౌండ్ ఖాళీగా ఉంది. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాణించారు అని! అది పెద్ద తప్పుడు స్టేట్మెంట్. రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరయినా కొండలాంటి కాంగ్రెస్ ను ఆ రోజు ఎన్టీఆర్ లాంటి నేతలు అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేతలు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే చిత్తు చిత్తుగా ఓడించడం సాధ్యమా? కనుక మనం ఏది పడితే అది మాట్లాడడం తగని పని అని ఎవ్వరైనా తెలుసుకుంటే మేలు. జాతికి సంబంధించి ఓ స్థాయిలో ఉన్న వ్యక్తుల వివరం, విశిష్టత అన్నవి గుర్తిస్తే ఇంకా మేలు.
ఇక వందేళ్ల ఎన్టీఆర్ మనకు ఎలా గుర్తుకు వస్తారు. భాషను బతికించే క్రమంలో ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. తెలుగు జాతి కీర్తిని పెంచిన క్రమంలో ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాల రూపంలో ఆయన గుర్తుకు వస్తారు. సంస్కరణల్లో ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన విషయంలో గుర్తుకు వస్తారు. ఎర్రన్న లాంటి, యనమల లాంటి, దేవేందర్ గౌడ్ లాంటి బీసీ నాయకులను ప్రోత్సహించిన రీతిలో గుర్తుకు వస్తారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించిన వైనంలో ఆయన గుర్తుకు వస్తారు.
చెన్నయ్ కు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా గుక్కెడు నీళ్లు అందించిన ఘనత పొందిన దిగ్గజ నేతగా గుర్తుకు వస్తారు. కాంగ్రెస్ పార్టీ కొమ్ములు విరిచిన నాయకుడిగా ఇప్పటికీ ఎప్పటికీ ఆ కాంగ్రెస్ నేతలకు కూడా ఆఖరికి వైఎస్సార్ కు కూడా ఆదర్శనీయ వ్యక్తిగా, గురువులను గౌరవించిన వ్యక్తిగా ఎన్నటికీ గుర్తుండి పోతారు.
అనండిక జోహార్ ఎన్టీఆర్.. జోహార్ జోహార్ .. శతవసంతాల ఎన్టీఆర్ కు జేజేలు.. ఆ కృష్ణాతీరాన పుట్టిన వెలుగు తేజానికి తెలుగు రాజసానికి జేజేలు.