ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డి పేరు వినిపించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితతోపాటు రాఘవ్ ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపించింది. సౌత్ సిండికేట్ ను వీరిద్దరూ నడిపించారని, ఆప్ సర్కార్ కు వంద కోట్ల ముడుపులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ కేసులో అరెస్టయిన రాఘవ్ కు ఢిల్లీ హైకోర్టు కొద్ది రోజుల క్రితం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని రాఘవ్ బెయిల్ పిటిషన్ వేశారు. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో రాఘవ కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు రాఘవ్ కు 2 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలోనే రాఘవ్ బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించింది. బెయిల్ కోసం రాఘవ చూపించిన కారణాలు సహేతుకమైనవి కాదని, అవి అవాస్తవాలుగా కనిపిస్తున్నాయని పిటిషన్ లో కోరింది. ఈ క్రమంలోనే తాజాగా రాఘవ్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. రాఘవ్ కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ నెల 12న సరెండర్ కావాలని ఆదేశించింది. దీంతో, మాగుంట శ్రీనివాసులు, రాఘవ్, వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది.