విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మోసాలకు పాల్పడుతూ ఎందరినో ముంచేసిన ఖతర్నాక్ ఒక యువ క్రికెటర్ ను ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతగాడి బాధితుల జాబితాలో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఉండటం విశేషం. అతగాడు మోసాల చిట్టా పెరిగి.. చివరకు దేశం విడిచి పారిపోతుండగా పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అతడ్ని విచారించిన వేళ.. అతడు చెప్పిన వివరాల్ని విన్న పోలీసులు సైతం షాక్ తినే పరిస్థితి.
హరియాణాలోని ఫరీదాబాద్ కు చెందిన మృణాంక్ సింగ్.. గతంలో ఆ రాష్ట్ర అండర్ 19 జట్టుకు ఆడాడు. తర్వాతి కాలంలో మోసాలకు అలవాటు పడిన అతను క్రికెట్ ఆడటం మానేశాడు. 2014-2018 మధ్య కాలంలో ఒక ఐపీఎల్ జట్టుకు ఆడినట్లుగా చెప్పి.. పలువురు మహిళల్ని.. అంతర్జాతీయ బ్రాండ్లను మోసం చేశాడు. అక్కడితో ఆగకుండా విలాసవంతమైన హోటళ్లలో బస చేయటం.. తానో పాపులర్ క్రికెటర్ గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడేవాడు.
ఢిల్లీలో ఒక ప్రముఖ హోటల్లో వారం పాటు బస చేసిన అతను.. హోటల్ బిల్లు రూ.5.53 లక్షలుకాగా.. ఆ మొత్తాన్ని చెల్లించకుండా వెళ్లిపోయాడు. బిల్లు మాటేమిటి? అని అడిగితే తన స్పాన్సర్లు చూసుకుంటారని బదులిచ్చాడు. అతడి మాటల్ని నమ్మిన బ్యాంక్ సిబ్బంది పేమెంట్ వివరాల్ని అతడికి షేర్ చేయగా.. రూ.2 లక్షలు ట్రాన్సఫర్ చేసినట్లుగా చెప్పి నకిలీ రశీదును హోటల్ సిబ్బందికి పంపాడు. అయితే.. తాము మోసపోయినట్లుగా గుర్తించిన హోటల్ యాజమాన్యం అతడి మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో.. ఢిల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
డిసెంబరు 25న హాంకాంగ్ వెళ్లేందుకు మృణాంక్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రాగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనూ తాను సీనియర్ ఐఏఎస్ అధికారినంటూ మోసగించే ప్రయత్నం చేశాడు కనీ అతడి పప్పులు వారి వద్ద ఉడకలేదు. దీంతో.. ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని అతడ్ని ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా అతడ్ని విచారించిన పోలీసులకు అతగాడు చెప్పిన వివరాలు విని అవాక్కు అయ్యారు.
తాను పోలీసు అధికారినంటూ కొందరిని.. ఐఏఎస్ అధికారిని అంటూఇంకొందరిని మోసం చేసిన అతను చివరకు టీమింియా క్రికెట్ జట్టు సభ్యుడు కమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ను కూడా మోసం చేసినట్లుగా గుర్తించారు. లగ్జరీ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అందిస్తానని చెప్పి.. లగ్జరీ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నట్లుగా చెప్పి బుట్టలో వేసుకున్నాడు. అతన్నినమ్మిన రిషబ్ అతడికి ఏకంగా రూ.1.63 కోట్ల మొత్తాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత తాను మోస పోయినట్లుగా గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతగాడి ఘన చరిత్ర తెలుసుకుంటున్న వారంతా అవాక్కు అవుతున్నారు.