11 మంది మహిళలు.. చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు వేరు చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపిస్తుంటారు. వీళ్ల నెల జీతం కూడా మరీ ఎక్కువేమీ కాదు. ఓ వైపు కుటుంబాలను నెట్టుకొస్తూ పేదరికంలో బతుకుతున్నారు. కానీ అందరూ కలిసి చిల్లర పోగుచేసి రూ.250 లాటరీ టికెట్ కొన్నారు. అంతే వీళ్ల దశ తిరిగిపోయింది. ఆ లాటరీలో వీళ్లకు రూ.10 కోట్లు వచ్చాయి. ఇది నిజంగా జరిగింది.
కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న పరప్పణగాడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపించడం వీళ్ల పని. ఇందులో ఉన్న 11 మంది మహిళలు లాటరీ టికెట్ కొనాలనుకున్నారు. దీని ధర రూ.250 కాగా.. ఏ ఒక్కరి వద్ద అంత డబ్బు లేకపోయింది. దీంతో తమ దగ్గర ఉన్న చిల్లర మొత్తం పోగు చేసి టికెట్ కొనుగోలు చేశారు.
తాజాగా కేరళ లాటరీ డిపార్ట్మెంట్ వాళ్లు డ్రా తీయగా.. ఈ మహిళలు కలిసి కొన్ని టికెట్ నంబర్ వచ్చింది. ఈ మహిళలకు రూ.10 కోట్ల లాటరీ తగిలింది. దీంతో వీళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్కసారిగా అందరూ లక్షాధికారులైపోయారు. వచ్చిన డబ్బును సమానంగా పంచుకుంటామని చెబుతున్నారు. తమ పిల్లల చదువు, పెళ్లిల్లు, తమ ఆరోగ్యం కోసం ఈ డబ్బులు వాడుకుంటామని సంతోషపడుతూ చెప్పారు.