జగన్ హయాంలో హిందూ ఆలయాలు, ఆస్తులు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని టీడీపీ, బీజేపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నవారిపై జగన్ కఠిన వైఖరి అవలంబించడం లేదని, కఠిన శిక్షలు విధించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక, జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, ఆ విమర్శలకు బలం చేకూరేలా జగన్ వైఖరి కూడా ఉందని ఇప్పటికే పలు ఘటనలు నిరూపించాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామి కూడా ఎదురు చూడాల్సిందేనని షాకింగ్ కామెంట్లు చేశారు. దేవుడిని కూడా వెయిట్ చేయించే స్థాయికి జగన్ ఎదిగిపోయారని ఎద్దేవా చేశారు.
విశాఖపట్నంలోని రుషికొండలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానం నిర్మించింది. వాస్తవానికి 2 నెలల క్రితమే దానిని ప్రారంభించాలి. కానీ, వేరే కార్యక్రమాలతో సీఎం జగన్ బిజీగా ఉన్నారని, అందుకే ఆ కార్యక్రమం వాయిదా వేశామని దేవాదయ శాఖాధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే విష్ణుకుమార్ రాజు స్పందించారు. విశాఖలో వైసీపీ నాయకుల ఇంళ్లలో శుభకార్యాలు, కార్యక్రమాలకు వస్తున్న జగన్…ఆలయం ప్రారంభించేందుకు మాత్రం సమయం చిక్కడం లేదని విమర్శించారు.
పూర్తయిన ఆలయాన్ని ఇలా ఉంచడం తగదని, స్థానికంగా ఉండే శారదా పీఠాధిపతితోనైనా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 10 రోజుల్లో ఆలయాన్ని ప్రారంభించకపోతే బీజేపీ ఆందోళనకు దిగుతుందని వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నాలా ఫీజు తగ్గిస్తే, జగన్ దొడ్డిదారిన పెంచేశారన్నారని మండిపడ్డారు.
వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు పార్టిషన్ ఫీజు కట్టాలని కొత్త ఉత్తర్వులు జారీ చేశారని, ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఏమరుపాటుగా ఉంటే గవర్నర్ బంగ్లాను కూడా జగన్ సర్కార్ తనఖా పెట్టేస్తుందని, అప్రమత్తంగా ఉండాలని విష్ణుకుమార్‌రాజు గవర్నర్ విశ్వభూషణ్‌కు సూచించారు.