అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైసీపీ నాయకులు నానా యాగీ చేస్తున్నసంగతి తెలిసిందే. అమరావతి భూముల్లో టీడీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ వైసీపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు, అమరావతిలో ఇన్ సైర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ హైకోర్టు కూడా చెప్పింది.
అయినా, వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం …ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ నోటీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ లోకేష్ స్పందించారు.
ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని నమ్మించడానికి జగన్ నానా తిప్పలు పడుతున్నారని, అవి చూస్తే నవ్వొస్తోందని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టినా జగన్ పాత పాటే పాడుతున్నారని సెటైర్లు వేశారు. 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారని దుయ్యబట్టారు.
సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరంటూ సవాల్ విసిరారు.అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబుకు నోటీసులిచ్చారని మండిపడ్డారు.
రాజధాని రైతుల ఆమోదంతోనే అసైన్డ్ భూములను నాటి ప్రభుత్వం తీసుకుందన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆర్కే ఎస్సీనా? లేక ఎస్టీనా? ఆయన ఫిర్యాదుతో కేసు ఎలా పెడతారని అచ్చెన్న ప్రశ్నించారు. అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అచ్చెన్న మండిపడ్డారు.