ఏపీ సీఎం జగన్ సతీమణి ఆధ్వర్యంలో నడుస్తోన్న సాక్షి దిన పత్రికలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ పై అసత్యాలతో కథనాలు, వార్తలు వండి వారుస్తుంటారన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తోన్న సంగతి తెలిసిందే. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు, చంద్రబాబు,లోకేష్ లపై ఏదైనా చిన్న విషయాన్ని పట్టుకొని దానిపై నానా యాగీ చేయడం సాక్షి మీడియాకు అలవాటేనని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలోనే సాక్షి దినపత్రికలో నారా లోకేష్ పై గత ఏడాది అక్టోబర్ లో ప్రచురించిన ఓ కథనం ఇపుడు ఆ సంస్థను చిక్కుల్లో పడేసింది.
తనపై రాసిన తప్పుడు కథనాన్ని ఖండిస్తూ సాక్షి పత్రికపై నారా లోకేష్ రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఉద్దేశంతో సాక్షి పత్రిక కావాలనే తప్పుడు కథనం ప్రచురించిందని విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో లోకేష్ దావా వేశారు. 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి 25 లక్షలండి’ శీర్షికతో కథనం ప్రచురితమైందని, ఆ కథనంలో తనపై రాసిన రాతలు అవాస్తవమని కోర్టుకు లోకేష్ ఆధారాలు కూడా సమర్పించారు.
ఆ బిల్లు మొత్తం తన ఒక్కడికే కాదని, ప్రోటోకోల్ ఉన్న ప్రముఖులందరికీ సంభంచిందిన బిల్లని లోకేష్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంకా చెప్పాలంటే ఆ బిల్లు పెట్టిన కొన్ని తారీఖులలో తాను అసలు విశాఖపట్నంలో లేనని, కొన్ని తేదీలలో ఏకంగా దేశంలోనే లేనని ఆయన రుజువులు సమర్పించారు. కానీ, ఆ 25 లక్షల బిల్లు విషయంలో తనపై తప్పుడు కథనం రాశారని కోర్టుకు తెలిపారు.
అయితే ఈ కథనంపై సాక్షి పత్రికను లోకేష్ వివరణ కోరారు. అయితే, లోకేష్ కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన పత్రిక ఎడిటోరియల్ టీం…తమ పత్రికలో ఆ కథనంపై సంజాయిషీ ఇవ్వడం గానీ, లోకేష్ కు క్షమాపణ చెప్పడం గానీ చెయ్యలేదు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్… సాక్షి పత్రికపై పరువునష్టం దావా దాఖలు చేయాల్సి వచ్చింది. కానీ, సాక్షి నుంచి ఈ కథనాన్ని తీసుకుని ప్రచురించిన వేరే పత్రికలు మాత్రం తమ పొరపాటుని ఒప్పుకుని ఆ స్టోరీని తీసి వేసి సంజాయిషీని ప్రచురించాయి. మరి, ఇప్పటికైనా సాక్షి కళ్లు తెరచి లోకేష్ కు క్షమాపణ చెబుతుందో లేదో వేచి చూడాలి.