ఏపీ, తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. తొలి విడత ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల సంఘం...శనివారం నాడు జరగనున్న రెండో విడత ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది.


ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో గడువు పూర్తి కాబోతోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఖాళీ కానున్న ఆయా స్థానాలకు మార్చి 14న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు సీఈసీ ప్రకటించింది. మార్చి 17వ తేదీన ఫలితాలు వెల్లడించి, మార్చి 22 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది.


తెలంగాణలో మహబూబ్ నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నారు. వరంగల్– ఖమ్మం– నల్గొండకు టీఆర్ ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏపీలో తూర్పు–పశ్చిమ గోదావరి నియోజకవర్గం నుంచి రాము సూర్యారావు, కృష్ణా–గుంటూరు నియోజకవర్గం నుంచి ఎ.ఎస్. రామకృష్ణలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో తాజాగా సీఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.  

ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల నోటిఫికేషన్– ఫిబ్రవరి 16 (మంగళవారం)
నామినేషన్లకు గడువు– ఫిబ్రవరి 23 (మంగళవారం)
నామినేషన్ల పరిశీలన– ఫిబ్రవరి 24 (బుధవారం)
నామినేషన్ల ఉపసంహరణకు గడువు– ఫిబ్రవరి 26 (శుక్రవారం)
పోలింగ్ తేదీ, సమయం – మార్చి 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం)
ఓట్ల లెక్కింపు, ఫలితాలు– మార్చి 17 (బుధవారం)

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.