“గంట-అరగంట.. చాలు.. అంటూ.. ఫోన్లలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబులపై చర్యలు లేవా?“ అని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. “అందరికీ విప్పి చూపించిన ఎంపీ గోరంట్ల మాధవ్, గంట కావాలన్న అంబటి, అరగంట చాలంటూ చెలరేగిన అవంతి ఫోన్లలో పోలీసులకు ఏ సీన్లూ దొరకలేదా“ అని నిలదీశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ల దగ్గరే గంజాయి, ప్రతిపక్షానికి మద్దతుగా ఉండే వాళ్ల మొబైళ్లలో పోలీసులు కోరుకున్న వీడియోలు దొరుకుతాయని లోకేష్ దుయ్యబట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ మానేసిన కొంతమంది పోలీసులు, సీఎం జగన్ రెడ్డి కోసం కిరాయికి పనిచేసే ఐప్యాక్ సిబ్బందిలా మారిపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యావంతుడు అంజన్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పోలీసు వ్యవస్థకే కళంకమంటూ లోకేష్ మండిపడ్డారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఎన్ఆర్ఐ అంజన్పై కేసు నమోదు చేయడాన్ని లోకేష్ తప్పుపట్టారు. 56వ రోజు యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెడుతున్నాడని ఎన్ఆర్ఐ అంజన్ పై కించపరిచేలా ముద్ర వేయడం తీవ్ర నేరమని వెల్లడించారు. పోలీసులు వైసీపీ కోసం పనిచేసే కట్టప్పల్లా మారిపోవడం వల్ల, హక్కులు-చట్టాలున్నాయని మరిచిపోతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరినీ చూస్తామని హెచ్చరించారు.
కాగా, యువగళం పాదయాత్ర 57వ రోజుకు చేరింది. రాప్తాడు నియోజకవర్గంలోని సీకే పల్లి మండలంలో 12 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన లోకేష్, అదే మండలం ప్యాదిండి వద్ద బస చేశారు. ఇప్పటి వరకు 719 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 57వ రోజు పాదయాత్రలో 18 కిలోమీటర్ల మేర నడిచారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాం ఇతర నేతలు పాల్గొన్నారు.