ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను టార్గెట్ చేసిన జగన్ …కక్షా రాజకీయాలకు తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. అయినప్పటికీ, అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్….యథేచ్ఛగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేసి పైశాచికానందం పొందుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
విపక్ష నేతలపైనేకాకుండా…ప్రభుత్వంపై నిరసన గళం వినిపించిన వారిపైనా, తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం కోస నిరసన తెలుపుతున్న రైతులపైనా పోలీసులను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ దాడులకు పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా విజయనగరంలోని ఎన్సీఎస్ షుగర్స్ ఫ్యాక్టరీ ముందు నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రశ్నించేవారిని జగన్ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని, ప్రజలైనా, ప్రతిపక్షమైనా, చివరికి అన్నదాతలనైనా…అంతా బాధితులేనని మండిపడ్డారు. తమకు రావాల్సిన బకాయిల కోసం న్యాయంగా చెరుకు రైతులు చేస్తున్న ఆందోళనను పోలీసులు భగ్నం చేశారని, రైతులపై ప్రభుత్వం దాడి చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు రావాల్సిన రూ.16.33 కోట్లు బకాయిలను ఎన్సీఎస్ షుగర్స్ యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ధర్నాకు దిగారని, మహిళలని కూడా చూడకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. బకాయి అడిగినందుకు ఇలా దాష్టీకానికి పాల్పడటం దారుణమని, సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. తక్షణమే చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు. వారిపై దాడిచేసిన వారిని శిక్షించాలని, ఈ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ ధైర్యం చెప్పారు.