ఒక మగ, ఒక ఆడ కలిసి.. సహజీవనం చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని సుప్రీం మంగళవారం పేర్కొంది. అంతే కాకుండా సహజీవనంలో కలిగే పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది.
2009లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తాజాగా కొట్టే వేస్తూ ఈ తీర్పు వెలువరించింది. చాలా ఏళ్లపాటు పెళ్లికి సహజీవనానికి చట్టం ఒకే విధంగా లేదని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. కేరళలోని ఎర్నాకులంకు చెందిన ఒక జంట సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేసింది. కాగా, వారికి ఒక కుమారుడు జన్మించా డు. అయితే ఆ జంట పెళ్లి చేసుకున్నట్లు సాక్ష్యాలు లేని కారణంగా, ఆ కుమారుడిని వివాహేతర సంతానంగా భావిస్తూ, పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని 2009లో కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది.
కాగా, కేరళ హైకోర్టును సవాలు చేస్తూ సుప్రీం తలుపు తట్టగా జస్టిస్ ఎస్.అబ్దుల్లా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పును తప్పు పడుతూ కొట్టి వేసింది. ఈ కేసులో తుది డిక్రీ జారీ ప్రక్రియను ట్రయల్ కోర్టు ఆలస్యం చేయడాన్ని సుప్రీం తప్పు పట్టింది.
‘‘ఒక జంట భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి ఉంటే వారిని వివాహం చేసుకున్నట్లుగానే భావించాలి. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 114 ఇదే సూచిస్తోంది. అలాగే ఇలాంటి సహజీవనంలో కలిగే సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా లభిస్తుంది. దీనిని అక్రమ సంతానంగా భావించకూడదు’’ అని సుప్రీం స్పష్టం చేసింది.
అయితే ఈ తీర్పును ఎవరౌనా సవాల్ చేయవచ్చని కోర్టు పేర్కొంది. అయితే వారు పెళ్లి చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత సవాలు చేసిన వారిపైనే ఉందని సుప్రీం పేర్కొంది.