ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను తిరిగి సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 1969 అఖిలభారత సర్వీసుల నిబంధనల ప్రకారం ఆయనపై సస్పెన్షన్ కొనసాగదని తెలిపింది. దీంతో, జగన్ కు మరోసారి ఈ తరహా ఘటనల్లో చుక్కెదురైందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా, జగన్ సర్కార్ పై పోరాడి విజయం సాధించిన వారిలో ఏబీ మొదటి వారు కాదు. అలా అని చివరి వారు కూడా కాబోరేమో.
జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారంలోనూ జగన్ ఇదే తరహాలో వ్యవహరించారు. ఆ తర్వాత ఏకంగా జాస్తి కిషోర్ ప్రమోషన్ తో సహా తిరిగి సర్వీస్ లో జాయిన్ అయ్యారు. ఇక, డాక్టర్ జితేంద్ర శర్మపై కూడా కక్ష సాధించిన జగన్ సర్కార్…చివరకు ఆయనను మెడ్ టెక్ జోన్ సీీఈవోగా చచ్చినట్లు పునర్నియమిచాల్సి వచ్చింది. ఇక, ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్లో జగన్ సర్కార్ పడ్డ పాట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
నిమ్మగడ్డకు జగన్ సర్కార్ ఎన్ని అవరోధాలు కల్పించినప్పటికీ…సుప్రీం కోర్టులో పోరాడి మరి ఎన్నికల కమిషనర్ గా తన పూర్తి పదవీ కాలం ముగించారు నిమ్మగడ్డ. ఇక, తాజాగా ఏబీవీ కూడా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పోస్టింగ్ తిరిగి సాధించి..మరో పోరాట యోధుడిగా నిలిచారు. పైన చెప్పిన అందరు అధికారులపై జగన్ కక్ష సాధించడం ఒక కామన్ పాయింట్ అయితే….వారంతా చంద్రబాబు నాయకత్వంలో లేదా ఆయన సమన్వయంతో నీతినిజాయితీగా పనిచేసి ఉండడం మరో కామన్ పాయింట్.
ఎన్ని అడ్డంకులెదురైనా, ప్రభుత్వాలే కక్ష గట్టినా….కుటుంబసభ్యులను వేధించినా..పరువుకు భంగం కలిగించినా…నిజాయితీగా పోరాడిన వీరంతా తమ సర్వీస్ లో తిరిగి జాయిన్ కావడానికి కారణం చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన అనుభవమే అనడంలో సందేహం లేదు. ఇక, జగన్ తానా అంటే తందనా అంటోన్న అధికారులు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తే…కచ్చితంగా ఊసలు లెక్కపెట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ శ్రీలక్ష్మి రూపంలో ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.