ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీని సాధించడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన `సూపర్ 6` హామీలు కీలక పాత్రను పోషించాయి. సుపర్ 6 లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుకు రూ.20 వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 నగదు, ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు.
వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించేందుకు కూటమి సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అలాగే తాజాగా మరో రెండు హామీలను నెరవేర్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అన్నదాతా సుఖీభవ పేరుతో రైతన్నలకు ఏడా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
అలాగే సూపర్ 6లో మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15వేల నగదు అందిస్తామని.. ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటుంటే అంత మందికి నగదు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే తల్లికి వందనం పథకాన్ని మరో మూడు నెలల్లో అమలు చేయబోతున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో విద్యార్థుల తల్లుల అకౌంట్ లో నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. తల్లికి వందనం అమలుకు రూ. 12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై కొండంత అప్పుల భారం ఉన్నప్పటికీ.. పథకాల అమలులో చంద్రబాబు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.