ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2022. రాష్ట్రంలోని రైతులను, భూమి యజమానులను తీవ్రంగా వణికించిన చట్టమిది! భూములను వివాదాస్పదం చేసి.. దురాక్రమణదారులకు ‘చట్టప్రకారం’ ఊతమిచ్చే చట్టం! భూములను మింగేసే రాక్షస చట్టం! ఈ విషయం అందరికీ స్పష్టమైంది. అసలు సంగతి ఏమిటంటే… దీని అసలు స్వరూపం మరింత క్రూరం, ఘోరం! ఇప్పుడున్న చట్టమే రాక్షసమైతే… దీని మూలరూపమైన బిల్లు బ్రహ్మ రాక్షసం! బారెడు కోరలతో రూపొందించిన ఈ బిల్లుపై కేంద్రం ఒకటికి రెండుసార్లు మండిపడడంతో… ఆ కోరలను కాస్త అరగదీశారు! అంతే! మిగిలిందంతా సేమ్ టు సేమ్! కేంద్రం రెండుసార్లు నిలదీసినా జగన్ వెనక్కి తగ్గలేదు. మూర్ఖంగా ముందుకెళ్లారు. చివరకు అదే ఆయన్ను ముంచేసింది.
అసలీ చట్టంతో లాభం ఎవరికి? ఈ చ ట్టాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధిపొందేది ఎవరు? పేదల భూములు మావేనంటూ దురాక్రమణదారులు, కబ్జాకోరులు లిటిగేషన్లు పుట్టించి భూ యజమానులను వేధించుకుతింటారు. లంచాలకు రుచిమరిగి అడ్డగోలు పనులు చేసేవారికే ఈ చట్టం ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తుంది. ప్రతి రైతూ దీని బాధితుడే. భూమి వివాదంలో ఇరుక్కుంటే ప్రతి భూ యజమానీ భాధితుడే. సివిల్ కోర్టులకు వెళ్లి న్యాయం పొందే హక్కును ఈ చట్టం కాలరాసింది. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఏ స్థాయిలో న్యాయం దొరక్కపోయినా పేదలు, బడుగువర్గాల రైతులు బలికావాల్సిందే. అప్పటికి ఎవరయినా ఆశలు ఉంటే చివరి ప్రయత్నంగా హైకోర్టుకు వెళ్లాల్సిందే.
ఇదీ జగన్ సర్కారు తీసుకొచ్చిన టైటిల్ చట్టం ప్రసాదించే ఊహించని కష్టం. ‘అసలిది చట్టమేనా? రాజ్యాంగానికి లోబడే ఉందా? మీకున్న శాసన పరిధిలోనే బిల్లు రూపొందించారా? అన్నీ చూసుకునే మా ఆమోదానికి పంపించారా’ అని సాక్షాత్తూ కేంద్రమే అడిగింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందులోని లొసుగులను తేటతెల్లం చేయడం ప్రజలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేశాయి. దీంతో.. అబ్బే ఇది రాష్ట్రం తెచ్చిన చట్టం కాదు.. కేంద్రమే చేసిందని అబద్ధాలు మొదలుపెట్టారు. నీతి ఆయోగ్ ముసాయిదా బిల్లు తయారు చేయడానికి ఐదు నెలల ముందే… 2019 జూలైలో జగన్ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును ఆమోదించారు.
ప్రజలతో, వారి మనోభావాలతో ఏమాత్రం సంబంధం లేకుండా.. తనకు తోచిన, తాను అనుకున్న నిరంకుశ ధోరణిలో దీనిని రూపొందించారు. కేంద్ర చట్టాలు, నిబంధనలను పట్టించుకోకుండా ‘అంతా నా ఇష్టం’ అన్నట్లుగా బిల్లును తయారు చేశారు. అయితే ‘భూమి’ ఉమ్మడి జాబితాలో ఉండడంతో ఇది చట్టం కావడానికి కేంద్రం ఆమోదం తప్పనిసరైంది. ఆ దశలోనే కేంద్రం నుంచి చీవాట్లు పడ్డాయి. 2021, 2022లో కేంద్రం ఈ బిల్లును వెనక్కి పంపింది. ఐదు కేంద్ర ప్రభుత్వ చట్టాలను ధిక్కరించేలా, టైటిల్ చట్టమే దేశంలో ‘సుప్రీం’ అన్నట్లుగా దీనిని రూపొందించారని తేల్చింది.
రాజ్యాంగానికి లోబడే ఈ బిల్లును తయారు చేశారా అని కేంద్రం ప్రశ్నించింది. ‘అవుననుకుంటే… అదెలాగో వివరించండి’ అని ఆదేశించింది. జగన్ సర్కారు ముచ్చటగా మూడోసారి 2023లో ఈ బిల్లును కేంద్రానికి పంపింది. అప్పుడు కూడా కేంద్రం వెనక్కి పంపించే పరిస్థితి ఉండటంతో… జగన్ ఢిల్లీలో అధికారుల ద్వారా, తాను కోరుకున్నది చేసే మోదీ అభిమాన మంత్రి ద్వారా లాబీయింగ్ చేసి మరీ ఆమోదం పొందారు. కేంద్రానికి పంపిన ఆ బిల్లులో చాలా ప్రజావ్యతిరేకమైన అంశాలు ఉన్నాయి.
‘ట్రైబ్యునళ్ల’తో డీలింగ్
టైటిల్ చట్టంలో భాగంగా టైటిల్ రిజిసే్ట్రషన్, టైటిల్ అప్పిలేట్ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటికి సివిల్ కోర్టుల అధికారం ఉంటుంది. ఈ ట్రైబ్యునళ్లు ‘సివిల్ ప్రొసీజర్ కోడ్ – 1908’కు అతీతం. అంటే… ట్రైబ్యునళ్లే సూపర్ పవర్! వాటిని ఎవరూ ప్రశ్నించ లేరు. ఇది 5/1908 చట్టాన్ని ధిక్కరించేలా ఉందని కేంద్రం అభ్యంతరం చెప్పింది. దీంతో ట్రైబ్యునళ్ల ఏర్పాటు ప్రతిపాదనను సర్కారు వెనక్కి తీసుకుంది. అయితే టైటిల్ రిజిసే్ట్రషన్ ఆఫీసర్, టైటిల్ అప్పిలేట్ ఆఫీసర్ అనే పోస్టులను సృష్టించింది. అంతకుముందు ట్రైబ్యునళ్లకు ప్రతిపాదించిన అధికారులనే కాస్త తగ్గించి ఈ అధికారులకు కట్టబెట్టింది. ‘ట్రైబ్యునళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా చట్టం అమలులో మంచి కోసమే అని భావించాలి’ అంటూ బిల్లులోని 41వ క్లాజులో వింత భాష్యం చెప్పారు.
ట్రైబ్యునళ్లలో ఉండేది ప్రభుత్వం నియమించిన అధికారులు/రిటైర్డ్ అధికారులే! అధికార పార్టీ నేతలతో ఒత్తిళ్లతో వీరు అడ్డగోలు నిర్ణయం తీసుకున్నా…దానిని ‘మంచి కోసమే’ అని భావించాలట! ఓ రైతు భూమిని మరొకరి పేరిట మార్చేసి టైటిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చినా అది మంచి కోసమనే భావించాలని ఈ క్లాజు సారాంశం. దీనిపై కేంద్ర హోం శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో ఆ క్లాజును బిల్లునుంచి వెనక్కి తీసుకున్నారు. కానీ… టైటిల్ రిజిసే్ట్రషన్ ఆఫీసర్ (టీఆర్వో), టైటిల్ అప్పిలేట్ ఆఫీసర్ (టీఏవో)లకు దాదాపుగా ఇవే అధికారాలు కట్టబెట్టారు. వాళ్లు చెప్పిందే ఫైనల్ అన్నట్లుగా చట్టాన్ని రూపొందించారు.
అసలుకే మోసం…
టైటిల్ రిజిసే్ట్రషన్, టైటిల్ అప్పిలేట్ ట్రైబ్యునళ్లు ఇచ్చే ఉత్తర్వులను జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని బిల్లులోని సెక్షన్ 55(1)(4)లో పేర్కొన్నారు. దీన్ని కేంద్ర న్యాయ శాఖ తప్పుపట్టింది. ఒకవైపు టైటిల్ చట్టంలో సివిల్ కోర్టుల ప్రమేయాన్ని నిషేధిస్తూ, మరో వైపు జిల్లా కోర్టుల్లో అప్పీల్ చేయవచ్చనడం పరస్పర విరుద్ధంగా ఉందని తెలిపింది. దీంతో ఆ బిల్లు నుంచి ఈ క్లాజునూ ఉపసంహరించారు. అలాగని… సివిల్ కోర్టుల్లో అప్పీలుకు అవకాశం కల్పించిందా అంటే అదీ లేదు. టీఆర్వో, టీఏవోల నిర్ణయాన్ని సవాలు చేయాలంటే ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సిందేనని.. సివిల్, జిల్లా కోర్టులకు సంబంధమే లేదని పేర్కొంది. దీనిపై స్థానిక, జిల్లా కోర్టుల న్యాయవాదులు మండిపడ్డారు.
ఈ కోర్టుల్లో సివిల్ కేసులన్నీ దాదాపు భూములకు సంబంధించినవే. తమ ప్రమేయం లేకుండా అధికారుల ద్వారా తీర్పులు ఇవ్వాలనుకోవడంపై వారు ఉద్యమానికి దిగారు. కోర్టులు కూడా బహిష్కరించారు. కొందరైతే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఒకసారి చట్టం అమల్లోకి రాదని చెప్పారు. మార్గదర్శకాలు సిద్ధం చేయలేదన్నారు. ప్రజల భూములకు ప్రమాదం లేదని చెప్పారు. ఇక సివిల్ కోర్టుల ప్రమేయాన్ని నిషేధించడాన్ని కేంద్రం కూడా తప్పుపట్టింది. సివిల్ ప్రోసీజర్ కోడ్-1908కి ఇది విరుద్ధమని… దీన్ని మార్చుకోవాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అయినా జగన్ పట్టించుకోలేదు. సివిల్ కోర్టులను పక్కకు తోసేశారు.
పునరావాసం.. ‘ప్రైవేటు’ వ్యాపారం
టైటిల్ చట్టం ద్వారా ఏర్పాటయ్యే ల్యాండ్ అథారిటీ కింద ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు పెద్ద ఎత్తున పునరావాసం/ఉపాధి కల్పించేలా క్లాజులు చేర్చారు. చట్టం చేసే పనులను ప్రైవేటుకు అప్పగించేలా స్కెచ్ గీశారు. కొన్ని రకాల లైసెన్సుల జారీని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించేలా క్లాజు 67 కింద ప్రతిపాదనలు చేశారు. అలా నియమితులయ్యే వారికి చట్టం పరిధిలో కీలక అధికారాలు కట్టబెట్టాలని భావించారు. ల్యాండ్ అథారిటీ వద్ద ఉండే రైతుల భూములు, ఆస్తుల డేటాను ప్రైవేటు వ్యక్తులు వినియోగించుకునేలా సెక్షన్ 68లో మరో వెసులుబాటు కల్పించారు. దీన్ని కేంద్రం తప్పుపట్టింది. ప్రభుత్వం వద్ద ఉండే డేటాను ప్రైవేటుకు ఫీజులు తీసుకొని ఇవ్వడాన్ని తప్పుపట్టింది. చట్టం పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు విస్తృత అధికారాలు కల్పించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
అపరిమిత అధికారాలు…
టైటిల్ చట్టం అమలులో ఏవైనా ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు ఎప్పుడంటే అప్పుడు చట్టంలో మార్పులు చేసుకునే అధికారాన్ని జగన్ సర్కారు కట్టబెట్టుకుంది. బహుశా… చట్టాన్ని, అందులోని క్లాజులను వ్యతిరేకిస్తూ ప్రజలు, రైతులు ఆందోళనలు చేస్తే వాటిని అణచివేయడానికి అడ్డగోలు సవరణలు చేయాలన్నదే దీని ఉద్దేశం కావొచ్చు. దీన్ని కేంద్రం తప్పుపట్టింది. ఈ చట్టానికి, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అంత అపరిమిత అధికారాలు ఉండటానికి వీల్లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అపరిమిత సవరణలకు వీల్లేదని చెప్పింది. దీంతో చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని అధిగమించేలా సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
భూసేకరణ చట్టం ఉందిగా…
కేంద్ర భూ సేకరణ చట్టం-2013ను పూర్తిగా ధిక్కరించేలా టైటిల్ బిల్లును రూపొందించారు. భూ సేకరణ చట్టం కింద తీసుకునే ప్రతీ చర్యను నిర్దేశిత గడువులోగా టైటిల్ రిజిసే్ట్రషన్ ట్రైబ్యునల్‌కు నివేదించాలని ఉంది. గడువు మీరినా చెప్పకపోతే సంబంధిత అధికారులపై చర్య తీసుకునే అధికారం కట్టబెట్టారు. ఇదే కాదు. మరో నాలుగైదు అంశాల్లో కేంద్ర చట్టాన్ని తోసిరాజనేలా క్లాజులు చేర్చారు. వీటిని కేంద్ర భూ వనరుల విభాగం తప్పుపట్టింది. రిజిసా్ట్రర్, సబ్రిజిసా్ట్రర్లను టైటిల్ రిజిసే్ట్రషన్ సేవలకు వాడుకుంటామని 27వ క్లాజు ప్రతిపాదించారు. రిజిసే్ట్రషన్ శాఖలోని ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) సేవలను టైటిల్ రిజిసే్ట్రషన్ ట్రైబ్యునల్‌కు వాడుకుంటామన్నారు. ఇది రిజిసే్ట్రషన్ చట్టం-1908కు విరుద్ధమని కేంద్రం తేల్చింది. సొంత క్లాజులు కుదరవని స్పష్టం చేసింది.
అడిగింది చెప్పాల్సిందే…
టైటిల్ రిజిసే్ట్రషన్ ట్రైబ్యునల్, అప్పిలేట్ ట్రైబ్యునల్లు కోరిన సమాచారాన్ని వ్యక్తులు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆరు నెలల జైలు శిక్షతోపాటు 50వేల రూపాయల జరిమానా విధించే అధికారాన్ని ట్రైబ్యునళ్లకు కట్టబెట్టారు. దీనిని కేంద్ర హోం శాఖ తప్పుపట్టింది. ఇది కేంద్ర చట్టాలకు విరుద్ధమైనదిగా తేల్చింది. దీంతో ఆ క్లాజును మార్చారు. జైలు శిక్షను తీసేసి, తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. అయితే.. ఇచ్చిన సమాచారం తప్పో కాదో తేల్చేది ప్రభుత్వం నియమించే అధికారులే!
‘ప్రైవేటు’ చేతికి భూసమాచారం
టైటిల్ చట్టం అమలులో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అపరిమిత అధికారాలతో పెత్తనం చెలాయించేలా ఈ బిల్లును రూపొందించడం గమనార్హం. ప్రజల ఆస్తులు, రైతుల సాగు భూముల డేటా వారి చేతుల్లో పెట్టాలనుకున్నారు. ఆ డేటా దుర్వినియోగమయ్యేందుకు అన్ని అవకాశాలు కల్పించారు. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో ‘ప్రైవేటు’ ప్రస్తావన తీసేసినప్పటికీ… మిగిలిందంతా దాదాపు సేమ్ టు సేమ్!
చట్టం అమల్లోకి రాకముందే శాశ్వత భూ హక్కుపత్రాలు
టైటిల్ చట్టం వల్ల రైతులకు దమ్మిడీ మేలు జరగలేదు. కానీ జగన్‌కు మాత్రం ఎనలేని మేలు జరిగింది. టైటిల్ చట్టం ఆధారంగా రైతులకు అందిస్తోన్న శాశ్వత భూ హక్కు పత్రాలు అవే పట్టాదారు పాసుపుస్తకాల నిండా జగన్ బొమ్మలే. ఆ పాసుపుస్తకం పేరు జగనన్న భూ హక్కు పత్రం. చిన్నగా రైతు ఫొటో ఒకటి ఉంటుంది. ఇక ప్రతీ పేజీలో జగన్ చిరునవ్వులతో ఉన్న ఫోటోలే. ఆ పాసుపుస్తకం పేరును చూస్తే అది జగన్‌దేనని అనిపిస్తుంది. దానిని సాంతం పరిశీలిస్తే జగన్ దయతో రైతుకు ఇచ్చిన హక్కుపత్రంలా ఉంది. టైటిల్ చట్టం కేంద్రంలో పెండింగ్‌లో ఉండగానే 2022లో జగన్ సర్కారు తీసుకొచ్చిన శాశ్వత భూ హక్కు పత్రాల నిండా ఆయన భజనే. చట్టం వస్తుందో రాదో అన్న ఆందోళనతో ముందుగా జగన్ ఫొటోలతో పాసుపుస్తకాలను నింపేశారు.
రెవెన్యూ, సర్వేశాఖలు ఆయనకు మోకరిల్లాయి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్పాసుపుస్తకం చట్టం-1971 (ఆర్ఓఆర్-రికార్డ్ ఆఫ్ రైట్స్) అమల్లో ఉండగా, దాన్ని ఉల్లంఘించి మరీ జగన్ సేవలో ఆ రెండు శాఖలు తరించిపోయాయి. ప్రజాధనంతో జగన్‌కు భజనచేస్తూ రెవెన్యూశాఖ అడ్డగోలు పాసుపుస్తకాలను ముద్రించింది. దశాబ్దాల తన చరిత్రను ఆయన కాళ్లముందు పరిచేసింది. రైతులకు ఇచ్చిన పాస్‌పుస్తకాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని భూములపై టైటిల్ జగన్‌దా? లేక రైతులదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూములు జగన్‌వా? లేక రైతులవా? అన్న ఆందోళన వ్యక్తం చేసేలా ఆ పుస్తకాలున్నాయి.
రాష్ట్రంలో భూముల నిర్వహణ, చట్టాల అమలు బాధ్యత రెవెన్యూశాఖదే. బ్రిటీషుకాలం నుంచి ఆ శాఖ సేవలకు ఓ పేరుంది. రాష్ట్రంలో భూ యజమానులు, సాగుదారులకు బ్యాంకు రుణాలు, ఇతర అవకాశాలు కల్పించేందుకు వీలుగా 1971లో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తక చట్టం (ఆర్ఓఆర్) తీసుకొచ్చారు. ఈ చట్టం కాలనుగుణంగా అనేక మార్పులు, సవరణలకు గురైంది. కానీ దాని మూలం మాత్రం అలాగేఉంది. ఈ చట్టం అమలుకు ఉద్దేశించిన రూల్స్ ప్రకారం సాగు భూమి ఉన్న ప్రతీ రైతుకు పాస్‌పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం కవర్‌పేజీ ప్రారంభంలో భూమి యాజమాన్య హక్కుపత్రం, మరియు పట్టాదారు పాసుపుస్తకం అని ఉంటుంది.
దాని కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాచముద్ర లోగో ఉంటుంది. కింది భాగంలో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రెవెన్యూశాఖ అని ఉంటుంది. ఆర్ఓఆర్ చట్టం రూల్స్‌లోని సెక్షన్ 6ఏ ప్రకారం పాసుపుస్తకంలో రైతు ఫోటో మాత్రమే ఉండాలి. ఆ ఫోటోపై తహసిల్ధార్ సీల్ ఉండాలి. అంతే తప్ప, ఇతరుల ఫోటోలు ఉండటానికి వీల్లేదని ఆర్ఓఆర్ రూల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. గత పాలకులు ఈ రూల్స్‌ను ఆచరించారు. గత ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఆ పుస్తకాలపై తమ ఫోటోలు ముద్రించాలని అనుకోలేదు. అలాంటి ఆలోచనలే చేయలేదు. ఎందుకంటే రైతులకు ఇచ్చే భూమి హక్కు పత్రాలు పద్దతిగా, చట్టానికి లోబడే ఉండాలని నాటి ముఖ్యమంత్రులు భావించారు.
కానీ జగన్ సర్కారు ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించింది. పాసుపుస్తకాలపై జగన్ కలర్ఫోటోలు వేయాలనుకుంది. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం ఇది సాధ్యంకాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టం ఆధారంగా కొత్తగా పాస్‌పుస్తకాలు ఇస్తోంది. ఆ పుస్తకం కవర్‌పేజీలో పెద్దగా జగన్ ఫోటోను ఏర్పాటు చే శారు. వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అని పేరును చేర్చారు. ఆ కింద జగనన్న భూ హక్కు పత్రం అనే మరో టైటిల్‌ను చేర్చారు. పాసుపుస్తకం చివరి పేజీలో కలర్‌పుల్ నవరత్నాల లోగో, మధ్యలో పెద్దగా జగన్ ఫోటోను ముద్రించారు. ఇక పుస్తకంలోని ప్రతీ పేజీలో జగన్ బొమ్మలే వేశారు. మూడో పేజీలో చాలా చిన్న సైజులో రైతు ఫోటోను ముద్రిస్తున్నారు. నిజానికి, ఆర్ఓఆర్ చట్టం అమల్లో ఉండగా పాస్‌పుస్తకాలపై రైతు ఫోటో మాత్ర మే ఉండాలి.
ఆ చట్టం రూల్స్‌కు అనుగుణంగానే పాస్‌పుస్తకాలు ముద్రించి రైతులకు ఇవ్వాలి. కానీ ఘనత వహించిన రెవెన్యూశాఖ ఆ చట్టాన్ని చాపలాచుట్టేసి, జగన్‌ముందు మోకరిల్లింది. చట్టంతో సంబంధం లేకుండా, అప్పటికి అమల్లోకి రాని టైటిల్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ బొమ్మలతో కలర్‌పుల్ పాసుపుస్తకాలు ముద్రించింది. కానీ ఇవి చెల్లవని రెవెన్యూ, న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అవి చెల్లవు. జగన్ ఫోటోలున్న పుస్తకాలు చెట్టుబాటు కావాలంటే ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దుచేయాలి. రెవెన్యూశాఖ ఆ పనిచేయకుండానే, జగన్ ఫోటోలతో పాస్‌పుస్తకాలు ఇచ్చేసింది. ఇది పూర్తిగా చట్టవిరుద్దమని రెవెన్యూ, న్యాయనిపుణులు చెబుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి జగన్ భజన చేస్తూ ముద్రించిన కొత్త పాసుపుస్తకాలు చెల్లవని రెవెన్యూశాఖ ఎందుకు గ్రహించలేకపోయింది. జగన్ భజనలో నిండా మునిగిపోయిన రెవెన్యూ, సర్వే అధికారులు ఈ మాత్రం గుర్తించలేకపోయారా?
‘టైటిల్’ అంటే తొక్కేయండి!
ఈ చట్టంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సమాచారం వచ్చినా.. సమర్థించుకోవడానికో.. తప్పులు దిద్దుకోవడానికో జగన్ ఏ మాత్రం ప్రయత్నించలేదు సరికదా.. ఈ చట్టం గురించి ఎవరు నోరెత్తినా కేసులు పెట్టి బొక్కలో వేయాలని ఆదేశించారు. ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనుకూల పోలీసు అధికారులను రహస్యంగా తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకున్నారు. మరికొందరు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ టైటిలింగ్ యాక్టు గురించి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని వారిని జగన్ ఆదేశించారు. అంతే.. అప్పటికప్పుడు కొందరు వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయడం.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు పెట్టడం.. సీఐడీ అధికారులు ఏకంగా అప్పటికే టీడీపీ కార్యాలయానికి వెళ్లి నోటీసులివ్వడం చకచకా జరిగిపోయాయి.