అనవసరంగా అధికార వైసీపీ నేతలు తమనెత్తిన తామే చెత్త వేసుకుంటున్నారా ? కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల వ్యవహారం చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుప్పం మున్సిపాలిటిలో 25 వార్డులున్నాయి. అన్నీ వార్డులకు కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్ధుల నామినేషన్లు వేశారు.
అయితే 14వ వార్డులో మాత్రం వివాదం రాజుకుంటోంది. ఇక్కడ నుండి టీడీపీ తరపున ప్రకాష్, ఆయన భార్య తిరుమగళ్ నామినేషన్లు వేశారు. ఇద్దరూ నామినేషన్లు వేసినా చివరకు ఎవరో ఒకరు మాత్రమే పోటీలో ఉంటారు.
ఇద్దరిలో ఎవరు పోటీచేయాలనే విషయం అన్నది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అయితే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే సోమవారం రిటర్నింగ్ అధికారి ఓ ప్రకటన చేశారు. అదేమిటయ్యా అంటే 14వ వార్డులో నామినేషన్లు వేసిన దంపతులిద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్న కారణంగా ఆ వార్డులో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచిందట. ఇక్కడే సమస్య రాజుకుంటోంది.
రిటర్నింగ్ అధికారి ప్రకటన చేయగానే వెంటనే దంపతులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. తాము కుప్పంలోనే లేమని కాబట్టి ఉపసంహరణ ఎలా చేసుకుంటామని నిలదీశారు. అయితే ఈ వార్డు ఫలితం ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశాం కాబట్టి ఏదైనా అభ్యంతరాలుంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పడం మరీ విచిత్రంగా ఉంది.
నిజంగానే దంపతులు పోటీ నుండి విత్ డ్రా చేసుకున్నదే వాస్తవమైతే ఉపసంహరించుకుంటున్నట్లుగా రాత మూలకంగా ఇచ్చే ఫారంను రిటర్నింగ్ అధికారి చూపుంటే బాగుండేది. అంతే కానీ అలాంటిదేమీ చేయకుండా తాము ప్రకటించేశాం కాబట్టి కోర్టుకెళ్ళమని చెప్పటం పూర్తిగా బాధ్యతా రాహిత్యమనే చెప్పాలి.
నిజానికి ఎంత మంది పోటీలో ఉన్నా గెలిచిదే తామే అన్న నమ్మకం ఉంటే వైసీపీ వాళ్ళు ఇంత గోలెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదే సమయంలో ఒక వార్డులో టీడీపీ గెలిచిందనే అనుకున్నా ఈ ఒక్క వార్డుతోనే టీడీపీకి మున్సిపాలిటి సొంతమై పోదు కదా. ఇంకా 24 వార్డులున్నాయి.
ఏ పార్టీకైనా మెజారిటీ సాధిస్తేనే కౌన్సిల్ సొంతమవుతుందన్నది చాలా సింపుల్ లాజిక్. నామినేషన్లు కూడా సక్రమంగా వేయనీయకుండా అడ్డంకులు సృష్టించడం, విత్ డ్రా సమయంలో గోల చేయడం వల్ల వైసీపీకి చెడ్డ పేరే కానీ లాభం లేదు.
కుప్పం మున్సిపల్ ఎన్నికను గెలుచుకుంటామన్న నమ్మకమే నిజంగా ఉంటే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపేందుకు అధికార పార్టీ అవకాశాలు కల్పించాలి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు తమకు ఇలాగే చేసిందని వైసీపీ నేతలు ఆరోపణలు కూడా సరికాదు.
ప్రజల మద్దతుతో ప్రశాంతంగా గెలచుకోవాల్సిన సీట్లను కూడా దౌర్జన్యాలతో గెలుచుకుంటోందనే ఆరోపణలతో గబ్బుపడుతోంది పార్టీ. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని పాలకులు గ్రహించాలి.
ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో దారుణాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం…
కుప్పం వంటి ప్రశాంతమైన ప్రాంతాల్లో కూడా బిసి అభ్యర్థివి ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల్లో తప్పుకొంటున్నట్టు చేయడం దారుణం. pic.twitter.com/FqTENo2Bfr— TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) November 9, 2021