దేశంలోని వివిధ రాష్ట్రాల వారు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇంగ్లిష్ లో కాకుండా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. షా ‘హిందీ’ వ్యాఖ్యలపై పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ఖండించారు. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఇది ‘దేశ భిన్నత్వంపై దాడి’ అని షాను ఉద్దేశించి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. భారతదేశం ఓ వసుదైక కుటుంబమని, భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని కేటీఆర్ అన్నారు. అటువంటి దేశంలోని ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయాలకే వదిలేయాలని కేటీఆర్ సూచించారు. దేశంలో ఏ భాష మాట్లాడాలో ప్రజలే ఎందుకు నిర్ణయించుకోకూడదని ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్ అవుతాయని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
తాను మొదట భారతీయుడినని, ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడినని, తెలంగాణ వ్యక్తినని కేటీఆర్ చెప్పారు. తన మాతృభాష తెలుగు అని, అయినా సరే ఇంగ్లిష్, కొంత హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలనని చెప్పుకొచ్చారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లిష్ భాషను నిషేధించడం వంటివి ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు కోరుకనే యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కేటీఆర్ అన్నారు. మరి, కేటీఆర్ కామెంట్లపై తెలంగాణ బీజేపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.