గతానికి వర్తమానానికి చాలానే తేడా వచ్చేసింది. సోషల్ మీడియా ఎంట్రీ లేనంతవరకు పరిస్థితులు ఒకలా ఉంటే.. ఇప్పుడు అందుకు భిన్నంగా మారిపోయాయి. అధికారంలో ఉన్న వారు చెప్పే మాటల్ని విని ఉరుకునే పరిస్థితి లేదు. వారు చెప్పే మాటల్లో నిజమెంత? అబద్ధమెంత? అన్న విషయాలపై అవగాహనకు వచ్చేస్తున్నారు ప్రజలు. ఇలాంటివేళ.. గతంలో మాదిరి రొడ్డుకొట్టుడు మాటలకు కాలం చెల్లిన విషయాన్ని అధినేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది.
చాలా విషయాల్లో స్మార్ట్ గా ఆలోచించే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కొన్ని విషయాల్లో మాత్రం పాత తరహా రాజకీయాలు చేస్తూ.. విమర్శలకు గురవుతున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని ఇటీవల కమ్మేసిన వానలు.. వరదలపై ప్రధాని మోడీ ఇప్పటివరకు సాయాన్ని ప్రకటించటం లేదన్న మాటను చెప్పి.. నిజమే కదా? అన్న భావన కలిగేలా చేశారు. మరి.. అలాంటి ఆయన.. అదే నోటితో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ.. అడ్డంగా బుక్ అయిపోతున్నారు.
హైదరాబాద్ లో కాంగ్రెస్ హయాంలోనే అక్రమణలు జరిగాయని.. నాలాలపై 28 వేల ఆక్రమణలు ఉన్నట్లుగా కిర్లోస్కర్ కమిటీ వెల్లడించింది. వాటిని కాంగ్రెస్ పార్టీ తొలగిస్తే నేటి పరిస్థితి వచ్చేది కాదన్న ఆయన మాటలు విన్నంతనే.. మనసుకు కొత్త సందేహాలు వెల్లువెత్తటం ఖాయం. తాము అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటిందని.. కాంగ్రెస్ చేసిన తప్పులకు శిక్ష వేసిన ప్రజలు.. తమకు అధికారాన్ని అప్పజెప్పారన్న వాస్తవాన్ని కేటీఆర్ ఎలా మర్చిపోతున్నారు.
తొలిసారి అధికారంలోకి వచ్చినంతనే.. నాలాలపై ఆక్రమణలపై తాము ఏదేదో చేస్తామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు సంబంధించిన వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ అవి లేకున్నా.. ఆరేళ్ల పదవీ కాలంలో.. కాంగ్రెస్ హయాంలోని అక్రమాల లెక్క ఎందుకు తేల్చలేదు? అన్నది అసలు ప్రశ్న. రాబోయే మూడేళ్లలో ఆక్రమణలు తొలగిస్తామని చెబుతున్న కేటీఆర్.. గడిచిన ఆరేళ్లలో ఏం చేసినట్లు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. ఆ విషయాల్నివదిలేసి.. ఎప్పుడో పవర్ పోయిన పార్టీ మీద భాద్యత నెట్టేయటం ఎంతవరకు సబబు కేటీఆర్?