వైసీపీపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా కోటంరెడ్డి నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు. క్వశ్చన్ అవర్ మధ్యలో మాట్లాడకూడదని, కోటంరెడ్డి నిరసనను, ప్రభుత్వం, తాను కూడా గుర్తించామని స్పీకర్ తమ్మినేని అన్నారు.
కానీ, శ్రీధర్ రెడ్డి అలాగే నిల్చొని ఉండడంతో ఆయనపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శాసనసభలో కావాలనే కోటంరెడ్డి రగడ చేయాలనుకుంటున్నారని, సభను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని ఆరోపించారు. కోటంరెడ్డి నైతిక విలువలు లేని వ్యక్తి అని, చంద్రబాబు మెప్పు కోసమే మాట్లాడుతున్నారని ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయని అంబటి షఆకింగ్ కామెంట్స్ చేశారు.
సభకు రాకముందు కూడా సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద కూడా కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యల ప్లకార్డులను ప్రదర్శిస్తూ సభకు నడుచుకుంటూ వెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన నిరసన కొనసాగుతుందని చెప్పారు. ఆ సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానని చెప్పారు. తనకు సభలో మైకు ఇచ్చే వరకూ అడుగుతూనే అన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డులను ప్రదర్శిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.