ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో వారు ఆధారాలతో దొరికిపోయారు. స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ తో హద్దుమీరి ప్రవర్తించి బుక్కైపోయారు ఏపీ సీఎస్ మరియు మంత్రులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని మధ్య లేఖల పరంపరలో నిమ్మగడ్డ తన విధుల పరిధి ప్రకారం నడుచుకుంటూ ఉంటే… సీఎస్ నీలం సాహ్ని మాత్రం తన పరిధి దాటారని విశ్లేషకులు చెబుతున్నారు.
మంత్రి కొడాలి నాని తనకు సంబంధం లేని వ్యవహారమైన దీనిపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనపై మంత్రికొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్య తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు SEC నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది సంచలనం అవుతోంది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించే హక్కు ఎన్నికల సంఘానికి ఉంది. ఆ విషయం మరిచిపోయి ఎన్నికలు జరపడానికి వీల్లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియంత్రంచడానికి ప్రభుత్వం, మంత్రులు, అధికారులు ప్రయత్నించడంతో వారంతా ఇపుడు చిక్కుల్లో పడ్డారు.
ఎన్నికల తేదీలను నిర్ణయించేది ఎన్నికల సంఘమే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం కాదని స్పష్టం చేస్తూ గురువారం ప్రధాన కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ రాశారు. ఎన్నికల తేదీలను నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదన్న భ్రమల్లో ఉంటే తొలగించుకోవాలని, దీనిపై ఏమైనా సందేహాలుంటే కోర్టును అడిగి స్పష్టత తెచ్చుకోవాలనీ ఆయన లేఖలో సూచించారట నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ప్రభుత్వం వ్యక్తిగతంగా ఆలోచించడం తప్పు అని ఆయన పేర్కొన్నారట.
ప్రభుత్వ సహాయ నిరాకరణతో ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో సమావేశం నిర్వహించేందుకు రెండో సారి చేసి ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే. ఇది కూడా ప్రభుత్వ చిక్కులకు కారణమే. SEC వీడియో సమావేశానికి హాజరవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారుల్ని ఆదేశించాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొనాలని నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించినా ఆమె సానుకూలంగా స్పందించలేదు. ఇది ఆమెను చిక్కుల్లో పడేసే ప్రమాదం కనిపిస్తోంది.