తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ మూడేళ్ల పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. 2020 మార్చి నెలలో పదవి చేపట్టిన ఆయన ఇప్పటికే మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నప్పటికీ ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఎన్నికలు ఉండడంతో ఆయన్ను మరికొంత కాలం కొనసాగిస్తారని ఇంతవరకు భావిస్తూ వచ్చారు.. అయితే, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పుంజుకొంటుండడం.. రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపు మళ్లుతుండడంతో అదే సామాజికవర్గానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తోంది.
తనను పదవి నుంచి తప్పిస్తారన్న సూచనలు బలంగా వస్తుండడంతో సంజయ్ కినుక వహించినట్లు చెప్తున్నారు. అయితే, సంజయ్ ప్రాధాన్యాన్ని ఏమాత్రం తగ్గించకుండా ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి కానీ, జాతీయ కార్యవర్గంలోకి కానీ తీసుకోవడం గ్యారంటీ అని దిల్లీలోని బీజేపీ నేతలు అంటున్నారు. సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న గత మూడేళ్ల కాలంలో మూడు ఉప ఎన్నికలలో రెండింట్లో విజయం, ఉపాధ్యయ ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకూల ఫలితాలు, జీహెచ్ఎంసీ ఎన్నికలలో 48 మంది కార్పొరేటర్లును గెలిపించుకోవడం వంటి విజయాలు ఉండడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా సంజయ్‌ను ప్రాధాన్యం గల పదవిలోకి తీసుకోవాలనే యోచిస్తున్నారు.
సంజయ్ కంటే ముందు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్‌కు కూడా ఆ పదవి తరువాత కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి ఆయనకు ఇవ్వడమే కాకుండా అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డులోకి కూడా లక్ష్మణ్‌ను తీసుకున్నారు. కిషన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి అప్పగిస్తే ఆయన స్థానంలో సంజయ్‌ను కానీ, లక్ష్మణ్‌ను కానీ తీసుకోవచ్చు. లక్ష్మణ్‌ను కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే సంజయ్‌కు లక్ష్మణ్ తరహాలోనే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించొచ్చు.