కొలీజియం వ్యవస్థపై, జడ్జిలపై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసుల్లో తీర్పులు చెప్పడం మానేసి తమ సగం సమయాన్ని జడ్జీలుగా ఎవరిని నియమించాలన్న దానిపైనే జడ్జిలు వృథా చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. కొలీజియం విధానం పారదర్శకంగా లేదని, ఆ నియామక ప్రక్రియలో మార్పు రావాలని ఆయన అన్నారు.
కోర్టుల్లో కంటికి కనిపించని రాజకీయం జరుగుతోందని, న్యాయ వ్యవస్థ కార్యకలాపాలు పారదర్శకంగా లేవని కిరణ్ షాకింగ్ కామెంట్లు చేశారు. న్యాయం చేయడానికి బదులు జడ్జిలు కార్యనిర్వాహకులుగా వ్యవహరించాలని చూస్తుననారని ఆరోపించారు. అలా అయితే, మొత్తం వ్యవస్థనే పునఃపరిశీలించక తప్పదని హెచ్చరించారు. కొలీజియం వ్యవస్థలో రాజకీయాలకు తావు లేదని, జడ్జిల నియామక ప్రక్రియలో మార్పులు రావాలని అన్నారు.
జడ్జిలను జడ్జిలే నియమించే ప్రక్రియ ప్రపంచంలోనే ఎక్కడా లేదని, భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను నియమించడం కేంద్రం బాధ్యత అని కిరణ్ రిజిజు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ న్యాయమూర్తులను నియమించేదని అన్నారు. ఆ క్రమంలోనే 1998లో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రారంభించిందని, అప్పటి నుంచి న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమిస్తున్నారని అన్నారు. అయితే, కిరణ్ రిజిజు వ్యాఖ్యలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్రంగా పరిగణిస్తున్నారు. కిరణ్ కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.