ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో వలసల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమైతే.. మరోవైపు పార్టీలో కీలక నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. అధికారం లేని చోట ఉండడం కంటే అధికార పార్టీల్లోకి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు, సీనియర్ నాయకులు జగన్ కు గుడ్ బై చెప్పేశారు. అయితే ఈ జాబితాలో అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా చేరబోతున్నారని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే కేతిరెడ్డి వైసీపీని వీడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా కేతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. `నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం. ఇకపై కూడా మా ప్రయాణం ఆ కుటుంబంతోనే సాగుతుంది. పదవులు ఆశించి నేను రాజకీయాల్లోకి రాలేదు. నన్ను నమ్ముకున్న వారి కోసమే వచ్చాను. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటా. ఆయన కుటుంబానికే తోడుగా నిలుస్తా` అంటూ కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.
కాగా, తన తండ్రి కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి హత్య అనంతరం రాజకీయాల్లో వచ్చిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ద్వారా విపరీతమైన పాపులరిటీ సంపాదించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గ ప్రజలు కేతిరెడ్డికి షాక్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేతిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనకపోవడంతో.. ఆయన పార్టీ మారబోతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ తాజాగా ఈ వార్తలను కేతిరెడ్డి కొట్టిపారేశారు.