టీడీపీపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా అలకబూనిన సంగతి తెలిసిందే. దాదాపుగా పార్టీ చేపడుతున్న మెజారిటీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేశినేని…బహిరంగంగానే పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేశినేని సొంతపార్టీ నేతలపై షాకింగ్ కామెంట్లు చేశారు. టీడీపీ ఇన్చార్జిలపై కేశినేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్చార్జిలు ఎవరు గొట్టం గాళ్ళు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నాని షాకింగ్ సమాధానాలిచ్చారు.
పార్టీ మారే ఆలోచన లేదని, చిర్రెత్తుకొస్తే అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేశానని వారు భావిస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తానని, అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను అని అన్నారు. ఇన్చార్జి పదవి రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, ఎమ్మెల్యే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి అని, పార్టీ సౌకర్యం కోసం సౌలభ్యం కోసం ఇన్చార్జిని నియమించుకుంటుందని అన్నారు. రాజులు, రారాజులు, సామంత రాజులు ఎవరు లేరని, ఇది ప్రజాస్వామ్యం అని అన్నారు.
తాను ప్రజలు ఎన్నుకున్న ఎంపీని అని, విజయవాడ ఈస్టులో ప్రజలే ఎంపీగా రామ్మోహన్ గారిని ఎన్నుకున్నారని, వైసిపి ప్రజా ప్రతినిధులను కూడా ఎన్నుకున్నారని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తే ప్రజలకు మంచిది అని చెప్పారు. మహానాడుకు తనను పిలవలేదని, తన కాంట్రిబ్యూషన్ ఏమీ అక్కడ లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. మహానాడులో మొత్తం రామ్మోహన్ నాయుడుకి తప్ప వేరే వాళ్ళు ఎవరికీ అక్కడ పాత్ర లేదని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్చార్జి అని మీడియా చెబుతున్న వ్యక్తి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆఫీస్ ఓపెన్ చేశారని, ఆయన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అని, కానీ, ఆఫీసు ఓపెనింగ్ కు తనకు ఆహ్వానం అందలేదని నాని విమర్శించారు. అయితే, ఆ కార్యక్రమానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారని చురకలంటించారు. దాన్ని బట్టి టీడీపీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతానికి తాను ఏమీ చేయడం లేదని, టీడీపీ తనకు పొగ పెడుతోందని మీడియా మిత్రులు చెబుతున్నారని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.