ఆడలేక మద్దెల ఓడు అనే సామెతకు తగ్గట్లుగా తాజా పరిస్థితులు నెలకొన్నాయి. తమ తప్పుల్ని ఎదుటివారి మీద పడేయటం మొదట్నించి ఉన్నా.. ఇటీవల కాలంలో ఈ తీరు మరింత పెరిగింది.
ఏ చిన్న అవకాశం వచ్చినా.. మీద పడే విమర్శకు కులమో.. వర్గమో.. ప్రాంతమో.. మరేదో అంశాన్ని తోకలా జోడించి మీద వేయటం.. దానికి సోషల్ మీడియా సాక్షిగా రచ్చ రచ్చ చేయటం ఒక అలవాటుగా మారింది.
వ్యాక్సినేషన్ విషయంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వ్యూహాంతో ముందుకు వెళ్లలేదని చెప్పాలి.
కోవిడ్ టీకా విషయంలో కేంద్రం చూసుకుంటుందని రాష్ట్రాలు భావిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎలా ఎగరాలన్న అంశం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.
ఏతావాతా జరిగిందేమంటే.. సెకండ్ వేవ్ చెలరేగిపోతూ.. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు పెరగటం.. పెద్ద ఎత్తున మరణాలతో పాటు..ప్రజలు ఆరోగ్య హాహాకారాలు చేయటం మొదలైంది.
ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వాలు తాము చేసిన తప్పుల్ని గుర్తించి.. వాటిని అధిగమించే కన్నా.. తమ తప్పుల్ని ఎత్తి చూపే వారిపై విరుచుకుపడటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.
కేంద్రంతో సంబంధం లేకుండా సీరం సంస్థతో కేరళలోని పినరయ్ ప్రభుత్వం కోవిషీల్డ్ ను భారీగా ఆర్డర్ పెట్టింది. కోవిషీల్డ్ వ్యాక్సిన కోసం పెట్టిన ఆర్డర్ లో 3.5 లక్షల డోసులు తాజాగా కొచ్చికి చేరుకున్నాయి.
ఆ వచ్చిన టీకాల స్టాక్ ను కేరళ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లుగా కేరళ ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఇక్కడ.. చెప్పొచ్చేదేమంటే.. ఎంతసేపటికి వ్యాక్సిన్ కొరత.. కేంద్రం మీద నిందలు వేసే కన్నా.. వ్యక్తిగతంగా.. ప్రభుత్వ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమకు తాముగా టీకాల్ని సమకూర్చుకునే పని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది.
అంతేకానీ..వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థల తీరు పైనా.. వారి ఫార్ములాను మిగిలిన కంపెనీలకు అందించే లాంటి గొప్ప ఐడియాలు అక్కర్లేదు.
తమ ప్రజలకు వ్యాక్సిన్ అందేలా.. కేరళ ప్రభుత్వం మాదిరి ముందస్తుగా డబ్బులు అడ్వాన్స్ రూపంలో ఇచ్చేస్తే.. టీకాలు రాకుండా ఉంటాయా? ఒక చిన్న రాష్ట్రమైన కేరళ చేయగలిగిన పనులు.. అద్భుతాలు చేస్తామని చెప్పుకునే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో ఎందుకు వెనుకంజలో ఉన్నారంటారు?