‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌కి ఎదురే ఉండదనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఎంతో ఆశగా చేసిన ఉమెన్ సెంట్రిక్ సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. పెంగ్విన్, మిస్ ఇండియాలతో పాటు రీసెంట్గా వచ్చిన అన్నాత్తే లాంటి భారీ ప్రాజెక్టులు కూడా ఆమెకి నిరాశనే మిగిల్చాయి.
సర్కార్, రంగ్‌దే లాంటి కొన్ని సినిమాలు సక్సెస్ అయినా ఆ క్రెడిట్ అంతా హీరోల ఖాతాల్లోకి పోయింది. దాంతో తన స్థాయి సోలో హిట్ కోసం ఆరాటపడుతోంది కీర్తి. ‘గుడ్ లక్ సఖి’తో తన ఆశ నెరవేరుతుందని అనుకుంది. అయితే ఆ సినిమాని బ్యాడ్ లక్ వదలట్లేదు.
నగేష్ కుకునూర్ లాంటి వెర్సటైల్ డైరెక్టర్ ప్రాజెక్ట్ కావడంతో అనౌన్స్మెంట్తోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. 2019 ఏప్రిల్‌లో మొదటి షెడ్యూల్ మొదలైంది. నవంబర్ కల్లా డెబ్భై అయిదు శాతం తీసేశారు. అప్పటి నుంచి మొదలయ్యాయి సమస్యలు. కరోనా కారణంగా చాలా పెద్ద బ్రేక్ వచ్చింది.
2020 సెప్టెంబర్‌లో మళ్లీ షూట్ స్టార్ట్ చేసి ఫినిష్ చేశారు. కానీ రిలీజ్‌కి రెడీ అవడానికి మాత్రం చాలా టైమే పట్టింది. ఎన్నో ఆపసోపాల తర్వాత ఎట్టకేలకి ఈ నెల 26న రిలీజ్ చేయనున్నట్టు ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ ముహూర్తం కూడా మారిపోయింది.
ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్ల దగ్గర ఖర్చీఫులు వేసేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే నెల నుంచి పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దాంతో ఈ నెలలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయాలనుకున్నారు. నిజానికి ఆ రోజున రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ తప్ప మరే సినిమా రావట్లేదు. అయినా కూడా థియేటర్ స్పేస్ కోసం సినిమాని డిసెంబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
బహుశా ఆరోజు శ్లాట్ ఖాళీగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. చిన్నదో పెద్దదో.. మరే సినిమా పోటీ లేకపోతేనే బెటరని ఫీలైనట్టున్నారు. ఏదేమైనా కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్, బెస్ట్ యాక్ట్రెస్ నటించిన సినిమా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. మరి ఆ డేట్‌కైనా సఖి వచ్చేస్తుందో లేదో చూడాలి.