ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆయన అన్నయ్య ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆ చిత్రంలోని నాటు నాటు పాటకుగాను కీరవాణి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు, ఆస్కార్ అవార్డులకు కూడా ఈ పాట నామినేట్ కావడంతో తెలుగువారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ ఉత్సాహం రెట్టింపు చేసేలా కీరవాణికి పద్మశ్రీ అవార్డు దక్కింది.
కేంద్రం తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన పద్మ పురస్కారాల జాబితాలో కీరవాణి పద్మశ్రీ దక్కించుకున్నారు. తనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించిన కేంద్ర ప్రభుత్వానికి కీరవాణి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులతోపాటు కవితాకు సీతన్న గారి నుంచి కుప్పాల బుల్లి స్వామి నాయుడు గారి వరకు తన గురువులందరికి గౌరవ వందనాలు తెలియజేస్తున్నానని కీరవాణి ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
ఇక, తన సోదరుడు కీరవాణికి పద్మశ్రీ అవార్డు దక్కడంపై రాజమౌళి భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అందరు అభిమానులు అనుకున్నట్లుగానే పద్మశ్రీ గుర్తింపు కీరవాణికి ఎప్పుడో రావాల్సి ఉందని జక్కన్న అన్నారు. ఒకరి శ్రమకు గుర్తింపు ఊహించిన విధంగా అందుతుందని అన్నయ్య చెబుతుంటారని గుర్తు చేసుకున్నారు. తాను ఒకవేళ విశ్వంతో మాట్లాడగలిగితే కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా ఒకటి ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వమ్మా అని రిక్వెస్ట్ చేస్తానని జక్కన్న అన్నారు. తన పెద్దన్న కీరవాణి వయొలిన్ వాయిస్తుండగా..కింద కూర్చుని ఆస్వాదిస్తున్న ఫోటోను రాజమౌళి షేర్ చేశారు.