నేడు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఎగురవేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేసీఆర్…మోడీపై యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందని అన్నారు.
కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని ప్రధానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా…ఫలితం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో అడ్డుపడినా…రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు.
ఐదేళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందని, రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చేసిన కృషిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇటీవల ప్రశంసించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కావాలనే కేంద్రం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. రైతులు భిక్షగాళ్ళు కాదని.. రైతులతో పెట్టుకోవద్దని మరోసారి కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోందని మండిపడ్డారు.
బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతంతో మోడీ ముందుకెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు కేంద్రం పాల్పడుతోందన్నారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో రైతులపై భారం వేసేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణ వల్ల తెలంగాణ ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు.