సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగితే తమ పార్టీకి ప్రమాదం అని భావించిన కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఘన విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈ సారి కూడా కేసీఆర్ అదే వ్యూహాన్ని అనుసరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మరోవైపు ప్రత్యర్థి పార్టీలు అందుకు తగినట్లుగా సిద్ధమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ముందస్తు సూచనల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయడం విశేషం. దీంతో తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అయితే కేసీఆర్ మనసులో ఏముందో తాను చెప్తానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. కేసీఆర్ స్కెచ్ ఇదేనని ఆయన ఓ విషయాన్ని బయటపెట్టారు.
గుజరాత్‌తో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రఘునందన్ రావు కూడా ఇదే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేసీఆర్ కేంద్రంపై కొట్లాట ఆపి రెస్టు తీసుకుంటారని రఘునందన్ చెప్పారు.
ఒకవేళ యూపీలో మాత్రం బీజేపీకి ఏమైనా ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కేసీఆర్ వెంటనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి.. గుజరాత్‌తో పాటే ఎన్నికలకు వెళ్తారని రఘునందన్ జోస్యం చెప్పారు. గుజరాత్లో ఎన్నికలు జరిగే సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షా ఎక్కువగా దానిపైనే దృష్టి పెడతారని.. అప్పుడు తెలంగాణపై శ్రద్ధ చూపే అవకాశం ఉండదన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోందని వివరించారు.
అయితే యూపీలో బీజేపీ ఓడిపోతుందన్నది కేసీఆర్ భ్రమ మాత్రమేనని రఘునందన్ తెలిపారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ పార్టీకి అభ్యర్థుల కొరత లేదని టీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీనేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఇక్కడి రాజకీయాల్లో త్రిముఖ పోటీ నెలకొంది.
ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ.. అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చూసి దూసుకెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతూనే ఉంది. దీంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు ఈ పార్టీలు సిద్దమవుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది జరిగే గుజరాత్ ఎన్నికలకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.